రవీంద్రభారతి, మే 17: నందమూరి తారక రామారావు గొప్ప యుగ పురుషుడని, ఆయన ఎన్నో చారిత్రాత్మక, జానపద, సామాజిక చైతన్యం కలిగించిన సినిమాలలో నటించిన మహా నటుడని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. భాషా సాంస్కృతిక శాఖ, తేజస్వి కల్చరల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన ‘యుగ పురుషుడు ఎన్టీఆర్ శత జయంతి’ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం, దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రజలకు సందేశాత్మక చిత్రాలను అందించిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడని తెలిపారు.
అంతే కాకుండా, తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి ప్రజల మన్ననలు అందుకుని మహా నాయకుడిగా నిలిచారన్నారు. అనంతరం, ప్రముఖ నటుడు సాయి కుమార్కు ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఎన్టీఆర్ చిత్ర గీతాలహరిని గాయకులు భరద్వాజ్ బృందం ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి తదితరులు పాల్గొన్నారు.