సుల్తాన్ బజార్, మే 17: దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్న ఏకైక కమిషనర్ అనిల్ కుమార్ అని తెలంగాణ దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి క్రిష్ణమాచారి, జేఏసీ కన్వీనర్ పరాశరం రవీంద్రా చార్యులు అన్నారు. ఈ మేరకు మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో వారు కమిషనర్ అనిల్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వెలిబుచ్చారు.
అనంతరం వారు మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా అనిల్ కుమార్ బాధ్యతలను స్వీకరించిన అనంతరం, అన్యాక్రాంత మవుతున్న నాలుగు వేల ఎకరాల భూమిని ఎవ్వరి బెదిరింపులకు లొంగకుండా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. దీంతో శాఖకు సంబంధించిన కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కాపాడిన ఘనత కమిషనర్‌కే దక్కుతుందన్నారు. శాఖ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అర్చక, ఉద్యోగులకి న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో శాఖ జేఏసీ సభ్యులు చంద్రశేఖర శర్మ,ముఖ్య కార్యదర్శి బద్రీనాథాచార్యులు, గోపాల్ జోషి, వి.ఫణి కుమార్, కేఎస్ వాణి, ఎంవీ సంపత్, శివ ప్రియ, వెంకట నర్సమ్మ, శివ ఆదినారాయణ, జీపీ కులకర్ణి, శ్రీనివాస్ గౌడ్, సురేష్ పాల్గొన్నారు.