శంషాబాద్ రూరల్, మే 17: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం అల్లకల్లోలం అవుతుందని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. మోదీ సర్కార్ ఒక్కొక్కటిగా 23 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి అదానీకి అప్పగిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 14 మంది ప్రధానులు చేయలేని అప్పు మోదీ ఒక్కడే రూ.80 లక్షల కోట్లు చేసి దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల తుక్కుగూడలో జరిగిన బీజేపీ సభలో ఆ పార్టీకి చెందిన ఒక పెద్దాయన ఒక్కసారి అధికారం ఇవ్వండి అంటూ మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రజలకు ఏం చేశారో చెప్పలేక బీజేపీ నేతలు దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మతం, కులం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని నారాయణ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సయ్యద్ అప్సర్, పుస్తకాల నర్సింగ్‌రావు, నర్రా గిరి పాల్గొన్నారు.