మొయినాబాద్, మే 14 : విద్యార్థులు సాంకేతిక నైపుణ్యతపై పట్టు సాధించాలని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలో ఉన్న విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సినీ హీరో అడవి శేషు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉద్యోగాలను పొందారని చెప్పారు. విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభతోనే కళాశాలకు న్యాక్ గుర్తింపు లభించిందన్నారు. విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల రాష్ట్రంలోనే తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నట్లు ఆయన తెలిపారు.
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థులు దేశానికి సేవలందించేందుకు ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరాలన్నారు. విద్యార్థులు ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారని.. దేశానికి సేవ చేసేందుకు ఇండియన్ పోలీస్ సర్వీస్‌పై ఆసక్తిని పెంచుకోవాలన్నారు. అనంతరం కళాశాల టాపర్‌గా, వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు సినీ హీరో అడవి శేషుతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మజ, కళాశాల డైరెక్టర్ సాయిబాబారెడ్డి, డీన్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.