మన్సూరాబాద్, మే 11: గంజాయి రవాణా కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను హయత్‌నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం, అన్నెగుంట గ్రామం, ఒంటెగడ్డ తండాకు చెందిన శివాజీచౌహాన్ (20) క్యాటరింగ్ పని చేస్తుంటాడు. ఇతనికి షాకాపూర్ తండాకు చెందిన అర్జున్‌కు గంజాయి సరఫరా చేసే వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరికీ గంజాయి తరలింపులో జహీరాబాద్ మండలం, హోతీ గ్రామం, మడ్ తండాకు చెందిన డ్రైవర్ శివాజీచౌహాన్(43)సహకరిస్తుంటాడు.
ఈ నెల 7న ఒంటెగడ్డ తండాకు చెందిన శివాజీ చౌహాన్, మడ్ తండాకు చెందిన శివాజీచౌహాన్ ఇద్దరూ కలిసి గంజాయిని కొనుగోలుకు కారులో ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, మారేడ్‌మిల్లి ఏజెన్సీకి వెళ్లారు. దారకొండకు చెందిన దొమ్ము అనే వ్యక్తి వద్ద 358 కేజీల గంజాయిని కొనుగోలు చేసి ముంబైలో విక్రయించేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు ఈ సమాచారం విశ్వసనీయంగా అందడంతో మంగళవారం సాయంత్రం పెద్దఅంబర్‌పేట్ వద్ద మాటు వేసి వారిని పట్టుకున్నారు. వీరి నుంచి 358 కేజీల గంజాయి, కారు, మూడు మొబైల్ ఫోన్లు, రూ. 1300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిం దితులను బుధవారం రిమాండ్‌కు తరలించా రు. కేసుతో ప్రమేయమున్న అర్జున్, దొమ్ములు పరారీలో ఉన్నారు. ఈ సమావేశంలో డీసీపీ ఎస్వోటీ రాచకొండ కె.మురళీధర్, అడిషనల్ డీసీపీ క్రైమ్స్ లక్ష్మి, ఏసీపీ ఎస్వోటీ రాచకొండ డి. వెంకన్న నాయక్, హయత్‌నగర్ పీఎస్ సీఐ హెచ్. వెంకటేశ్వర్లు, ఎస్వోటీ ఎల్బీనగర్ జోన్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి పాల్గొన్నారు.