మియాపూర్, మే 11: ఓ పత్రిక సీఈఓగా పనిచేస్తున్నానని తనకు అధికారులు, ప్రముఖ వ్యక్తులందరు పరిచయమని వారితో దిగిన ఫోటోలను చూపించి ఏదైనా పనులు ఉంటే చేసిపెడతానని అమాయక ప్రజలను నమ్మించి వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసి మోసం చేసిన వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై యాదగిరి రావు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని ఎస్ఎంఆర్ టెక్నో పాలసీస్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఎం. రాజేశ్ ఓ పత్రికలో సీఈఓగా పనిచేస్తున్నాడు.
అమాయక ప్రజలను మోసం చేసి భూములు, ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి తనకు అధికారులు, ప్రముఖులు తెలుసు అని నమ్మబలికి వారి వద్ద నుండి లక్షల రూ. డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో నాగోల్‌కు చెందిన సత్యనారాయణ రెడ్డి ఇంట్లో రాజేశ్ రెండున్నర సంవత్సరాల క్రితం అద్దెకు ఉన్నాడు. ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. రాజేష్ ఓ స్థలాన్ని రూ. 28 లక్షలకు అమ్మించి అందులో 14 లక్షలు సత్యనారాయణకు ఇచ్చాడు. మిగత రూ.14 లక్షలు తరచూ అడగడంతో కొన్ని చెక్కుల రూపంలో ఇచ్చాడు.
ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో కూకట్పల్లి, నాగోల్ పోలీస్ స్టేషన్లో రాజేశ్‌పై చెక్ బౌన్స్ కేసులను నమోదు చేశారు. ఆ తరువాత నగరంలోని వసంత నగర్లో సత్యనారాయణరెడ్డి మియాపూర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సత్యనారాయణ కుమారుడు జగదీష్‌ను ఓ ఇండిపెండెంట్ హౌస్‌ను కొనుగోలు చేసేందుకు నిశ్ఛయించుకున్నారు. ఆ ఇంటి యాజమాని తనకు తెలుసని తక్కువ ధరకే ఇంటిని ఇప్పిస్తానని నమ్మించాడు. ఇంటి యాజమానికి తెలియకుండా అగ్రిమెంట్ చేసుకుంటానని రాజేశ్ సత్యనారాయణకు తెలిపాడు.
ఈ విషయంలో రూ.70 లక్షల నగదును సత్యనారాయణ, జగదీశ్‌లు రాజేశ్ ఇచ్చారు. రాజేశ్ పేరు నుండి సత్యనారాయణ పేరు మీదకు ఇల్లును అగ్రిమెంట్ చేస్తున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించి అమ్మివేశాడు. మోసపోయానని తెలుసుకున్న సత్యనారాయణ డబ్బులు తిరిగి ఇవ్వమని నిలదీశాడు. దీంతో రాజేశ్ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి వైజాగ్‌లో తనకు 5 ఎకరాల పొలం ఉందని దానిని కొనుగోలు చేయండని మళ్ళీ నమ్మించాడు. దీంతో సత్యనారాయణ సరే అని చెప్పాడు.
ఈ క్రమంలో సత్యనారాయణకు రాజేశ్ మళ్ళీ నకిలీ పత్రాలను చూపి అమ్మేందుకు ప్రయత్నించాడు. ఓ ప్రముఖ అధికారి వద్ద పొలానికి సంబంధించి పత్రాలు ఉన్నాయని నమ్మించి మరికొంత డబ్బులు వసూలు చేశాడు. ఈ విధంగా 8 సార్లు మోసానికి పాల్పడి వారి వద్ద నుండి రూ. 1 కోటి 16 లక్షల నగదును తీసుకొని వారిని మోసం చేశాడు. మోసాపోయానని తెలుసుకున్న సత్యనారాయణ అతన్ని నిలదీయగా రాజేశ్ తిరిగి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో బాధితుడు సత్యనారాయణరెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేసి బుధవారం అతని నివాసంలో రాజేశ్‌ను అదుపులోకి అరెస్ట్ చేసి విచారించగా డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.