వనస్థలిపురం, మే 11 : ముంపు సమస్య లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ సచివాలయ నగర్లో రూ.3కోట్లతో నిర్మించిన స్విమ్మింగ్ పూల్‌ను బుధవారం సాయంత్రం ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందు చూపుతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. రీజనల్ రింగ్‌రోడ్ లోపల మరో 50ఏండ్లు నీటి సమస్య లేకుండా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎస్ఆర్డీపీలో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నామని తెలిపారు. ముంపు నివారణకు రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. మంచి విజన్ ఉన్న నాయకుడు సుధీర్‌రెడ్డి అని, ఆయన నాయకత్వంలో ఎల్బీనగర్ సమగ్రాభివృద్ధి చెందుతున్నదని తెలిపారు.
త్వరలోనే తీపి కబురు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
పక్కా ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. ప్రతి డివిజన్‌కు ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పతుల్లా గూడలో మూడు శ్మశాన వాటికలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారి పక్కన బస్ టెర్మినల్ నిర్మిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ వస్తున్నామని, ఇక రిజిస్ట్రేషన్ల సమస్య మాత్రమే మిగిలి ఉందన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక జీవో తీసుకువచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, త్వరలోనే ఆ తీపి కబురు కూడా వింటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, త్రినేత్రాంజనేయ దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, చింతల రవికుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్నాటి అనిల్ చౌదరి, కాలనీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.