సుల్తాన్‌బజార్, మే 10: తండ్రితో కలిసి నగరం నుంచి ఆంధ్రాకు వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు చేరుకున్న మూడేండ్ల బాలుడు మంగళవారం అదృశ్యమయ్యాడు. అఫ్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ ఎం రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, రంగనాయకుల కాలనీకి చెందిన పి లక్ష్మణ్, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కూలీ పనుల నిమిత్తం లక్ష్మణ్ తన భార్య, చిన్న కూతరుతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య మండలం, లక్కిరెడ్డిపల్లికి చిన్న కొడుకు నవీన్(3)ను అమ్మమ్మ, తాతయ్య వద్ద వదిలి వెళ్లాడు.
ఇదిలా ఉండగా నవీన్‌ను తీసుకెళ్లేందుకు రెండు రోజుల క్రితం నగరానికి వచ్చిన లక్ష్మణ్ సోమవారం కొడుకును తీసుకొని కాచిగూడ రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ ఆంధ్రకు వెళ్లే రైళ్లు లేకపోవడంతో బస్సులో వెళ్లేందుకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు రాత్రి పదిన్నర గంటలకు చేరుకున్నాడు. ఎంజీబీఎస్ ఫ్లాట్ ఫారం 44 వద్దకు చేరుకున్న అనంతరం లక్ష్మణ్ తన కొడుకును అక్కడ నిలబెట్టి మూత్ర విసర్జనకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి కుమారుడు కనిపించకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న ఎస్ఐ పి. రామకిషన్ సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తును ముమ్మరం చేశారు. తప్పిపోయిన సమయంలో బాలుడు ఒంటిపై బ్లూ కలర్ స్లీవ్‌లెస్ టీ షర్టు, నేవీ బ్లూ కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు వివరించారు.