బంజారాహిల్స్, మే 10: జైలులో పరిచయం హత్యకు దారితీసింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిర్రా సమీపంలోని షాషిబ్లీహిల్స్‌కు చెందిన మహ్మద్ ఒమర్ అలియాస్ చిం టూ(25) ప్లంబర్. రెండేండ్ల క్రితం ఓ చోరీ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో అతనికి జైల్లో ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఫస్ట్ ల్యాన్సర్‌కు చెందిన మహ్మద్ అమీర్(22)తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ కలిసి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేస్తుండేవారు. సోమవారం రాత్రి ఇద్దరూ కలిసి ఆటోలో బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలానికి వచ్చి అర్థరాత్రి దాకా మద్యం సేవించారు. మద్యం మత్తులో గొడవ పడడంతో అమీర్ తన వద్ద ఉన్న బీర్‌బాటిల్‌తో ఒమర్‌పై దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి జకీరాబేగం ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.