బంజారాహిల్స్, మే 4: అసభ్యకరమైన సందేశాలతో ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్న యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన మల్రాజ్ సింగ్ ఔలాక్ (29) అమెరికాలోని కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారికి ఫోన్లో మెసేజ్‌లు పంపిస్తున్నాడు. ఆమె ఫొటోలు సోషల్ మీడియా నుంచి తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రెండు నెలల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని ఎంసీహెచ్ఆర్డీలో ఫౌండేషన్ కోర్సు కోసం నగరానికి వచ్చిన బాధితురాలు ఇక్కడే హాస్టల్లో ఉండేది.
ఆమె కోసం కాలిఫోర్నియా నుంచి వచ్చిన మల్రాజ్ సింగ్ గత నెల 1న ఎంసీహెచ్ఆర్డీకి వెళ్లాడు. రిసెప్షన్లో ఆమె బంధువునని పరిచయం చేసుకుని ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె నిరాకరించడంతో అంతుచూస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. ఈ మేరకు బాధితురాలు ఎంసీహెచ్ఆర్డీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు మల్రాజ్సింగ్ను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.