ఉస్మానియా యూనివర్సిటీ, మే 10: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్న టెక్నోస్మానియా 2కే22 వేడుకలు మంగళవారంతో ముగిసాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ట్రెజర్ హంట్, జనరల్ క్విజ్, డిబేట్ తదితర అంశాలలో పోటీలు జరిగాయి. పలు అంశాలపై అతిథి ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. అనంతరం సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. టెక్నోస్మానియా 2కే22 సందర్భంగా వివిధ అంశాలలో జరిగిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శక, నిర్మాత శేఖర్ కమ్ముల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి వేడుకల నిర్వహణతో విద్యార్థుల మధ్య స్నేహభావం పెరుగుతుందని అన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు ఇతర సృజనాత్మకత కలిగిన అంశాలపై కూడా దృష్టిసారించాలని సూచించారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలని అన్నారు. విద్యార్థులు ప్రస్తుత కాలానికి అనుగుణంగా అందుబాటులో ఉన్న సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవాలని చెప్పారు. తద్వారా పోటీ ప్రపంచంలో విద్యార్థులు మెరుగ్గా రాణించగలుగుతారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింత సాయిలు, టెక్నోస్మానియా కన్వీనర్ ప్రొఫెసర్ రాజం, కో కన్వీనర్లు డాక్టర్ పరమేశ్వర్లు, అభిలాష్, డాక్టర్ భాస్కర్, శ్రీనివాసులు, డాక్టర్ పరశురాం, స్టూడెంట్ కో ఆర్డినేటర్లు వనం గణేశ్, దీపికారెడ్డి, శివకృష్ణ, నీలేశ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.