సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే కాసిన్ని నీళ్లు ఎక్కడ దొరుకుతాయో అని ఆశగా వెదుకుతుంటాం. ఎప్పటికప్పుడు ఉష్ణతాపాన్ని తీర్చుకునేందుకు ఏదో ఒక రూపంలో నీటిని శరీరానికి అందిస్తుంటాం. అందుకే వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అనేక చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి..? చుక్క నీటికోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవి ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఏడేండ్ల కిందట ఎండ తీవ్రతను తట్టుకోలేక నీరసించిపోయిన కౌకల్ పక్షి(చెముడు కాకి) సికింద్రాబాద్ ప్రాంతంలో రోడ్డుపై పడిపోయింది. ఇది గమనించిన మియాపూర్ ప్రాంతానికి చెందిన పారాకుత్ ప్రదీప్ వెంటనే కౌకల్ పక్షికి నీరు తాగించగా మామూలు స్థితికి వచ్చి ఎగిరిపోయింది. వెంటనే ప్రదీప్‌కు ఓ ఆలోచన వచ్చింది. 15మంది సభ్యులతో యానిమల్ వారియర్స్‌గా ఏర్పడి నేడు అనేక పశుపక్ష్యాదుల దాహార్తిని తీరుస్తున్నారు. ఏడేండ్లుగా ప్రతి వేసవిలో దాదాపు 250 నుంచి 300 నీటి కుండీలను ఏర్పాటు చేసి ఎన్నో జీవాలకు ఊపిరిపోస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.