మేడ్చల్ కలెక్టరేట్, మే 10: ఒక ఓటరుకు ఒకే చోట ఓటుహక్కు ఉండేలా చర్యలు చేపడుతున్నామని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని రాజకీయ పార్టీ నేతలు, సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో ఓటర్ల సవరణ, ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వారు ఇక్కడ ఓటర్లుగా నమోదు అవుతున్నారని అన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి ఇండ్లకు బూత్ లెవల్ ఆఫీసర్లు వెళ్లి పరిశీలన జరపాలన్నారు. ఓటర్లు కోరుకున్న చోట ఓటుహక్కు ఉంచి ఇతర చోట తొలగించాలని స్పష్టం చేశారు. ఎవరికైనా రెండు చోట్ల ఓట్లు ఉంటే ఆ విషయాన్ని అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వివిధ పార్టీల నేతలు పొన్నాల హరీశ్‌రెడ్డి, సుదర్శన్, అధికారులు పాల్గొన్నారు.