జవహర్నగర్, మే 10 : మురుగు నీరు అంగన్వాడీ పాఠశాలలోకి పారడంతో దుర్వాసనతో చిన్నారులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలోకి వెళ్లాలంటే మురుగు కాలువను దాటితేనే అంగన్వాడీలోకి అడుగుపెట్టాలి. దీంతో నిత్యం గర్భిణులు, చిన్నారులు నానాఅవస్థలు పడుతూ మురుగు కాలువను దాటాల్సి వస్తోంది. జవహర్నగర్ కార్పొరేషన్లోని 7వ డివిజన్ బీజేఆర్నగర్లోని అంగన్వాడీ పాఠశాలలో చిన్నారులు, గర్భిణులు సమస్యలతో సతమతవుతున్నారు. గర్భిణులు అంగన్వాడీ పాఠశాలకు వచ్చి నిత్యం పౌష్టికాహారం ఇక్కడే తినాల్సి ఉంటుంది. పాఠశాలలోకి వచ్చే మురుగు వాసనతో అన్నం తినలేకపోతున్నామని వాపోతున్నారు. అంగన్వాడీ టీచర్ పలుమార్లు మురుగునీటిని తొలగించినా శాశ్వత పరిష్కారం కావడంలేదు. దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించి అంగన్వాడీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
శాశ్వతంగా పరిష్కరిస్తాం..
అంగన్వాడీ పాఠశాలలోకి చేరుతున్న మురుగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. మౌలిక వసతులను కల్పించి చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు గర్భిణులకు, చిన్నారులకు అందేలా కృషి చేస్తున్నాం. చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందజేస్తున్నది.
– జ్యోతిరెడ్డి, కమిషనర్, జవహర్నగర్