కీసర, మే 10 : అటవీశాఖ అధికారులు అడవుల సంరక్షణకు భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అటవీశాఖ భూములు కబ్జాలకు గురికాకుండా ఫెన్సింగ్ వేయిస్తున్నారు. కీసరలోని పెద్దమ్మ చెరువును ఆనుకొని అటవీశాఖ భూమిలో అధికారులు ప్రత్యేకంగా మొక్కలను పెంచి సంరక్షిస్తున్నారు. చెరువును ఆనుకొని ఉన్న ప్రదేశం అటవీశాఖ కిందికి రానుండటంతో అధికారులు ఆ భూమి చుట్టూ కడీలు వేసి ఫెన్సింగ్ వేసి రక్షణ చర్యలు చేపట్టారు. అటవీశాఖకు చెందిన భూముల సంరక్షణకు హద్దురాళ్లను ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. బీట్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్ల ఆదేశాలతో మండల అటవీశాఖ సిబ్బంది అటవీ భూముల సంరక్షణకు ప్రణాళికలను రూపొందించి ఎక్కడ ఖాళీ స్థలం కన్పించినా మొక్కలను పెంచి సంరక్షిస్తున్నారు.