బంజారాహిల్స్,మే 9: మన బస్తీ- మన బడి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని ఎంఆర్సీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మనబస్తీ-మన బడి’ పథకం కింద రూ.23.92లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధ్ది పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఫిలింనగర్ రౌండ్‌టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో రూ.68.74లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం కోసం సీఎం కేసీఆర్ మన బస్తీ-మన బడి పథకాన్ని ప్రారంభించారన్నారు. దీనిలో భాగంగా మంచినీటి సరఫరా, టాయ్‌లెట్స్, ఫర్నిచర్, ప్రహరీ నిర్మాణాలు, గ్రీన్ చాక్‌బోర్డ్స్ తదితర సౌకర్యాలను పెంచనున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంతో పాటు టీచర్ల కొరత లేకుండా చూస్తామన్నారు. ఫిలింనగర్ ఎమ్మార్సీ కాలనీలోని ప్రభుత్వ స్థలాన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్కూల్ విస్తరణ కోసం కేటాయించాలని స్థానికులు కోరారన్నారు. ఈ విషయంపై రెవెన్యూశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, చంద్రశేఖర్, నగేష్సాగర్, ప్రభాకర్,నడిమింటి కృష్ణ, ఎల్లయ్య, రాము, సంపంగి కిరణ్‌తో పాటు ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.