సుల్తాన్ బజార్, మే 8: విద్యార్థులు శ్రమను ఆయుధంగా చేసుకుంటే విజయం బానిసవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆదివారం అబిడ్స్‌లోని రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి బాలుర హాస్టల్ ఆడిటోరియంలో రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సబిత, రెడ్డి జన సం ఘం సలహాదారులు ప్రొ.కంచర్ల దశరథ్‌రెడ్డి, అధ్యక్షుడు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, కార్యదర్శి పాండు రంగారెడ్డిలతో కలిసి విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. అనంతరం, మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా అగ్రవర్ణాలలో పేదలు ఉన్నారని గుర్తించి, అన్ని వర్గాలతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిన ఘనత రాష్ట్ర సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
నిజాంల హయాంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో విద్యను అభ్యసించే వారికి వసతిని కల్పించేందుకు గాను నగర కొత్వాల్ రాజా బహదూర్ వెంటకరామిరెడ్డి రెడ్డి హాస్టల్‌ను స్థాపించగా అది నేడు ఎంతో మంది ఉన్నతంగా బతికేందుకు దోహద పడిందన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి పేరు మీద పోలీస్ అకాడమీకి పేరు పెట్టడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన ఇంటర్మీడియట్ విద్యాభ్యాసాన్ని రెడ్డి బాలికల కళాశాలలో పూర్తి చేశానని, ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రెడ్డి హాస్టల్లో కార్యక్రమానికి మొట్ట మొదటిసారి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. రెడ్డి హాస్టల్ విస్తరణ కోసం కోకాపేట్లో 15 ఎకరాల భూమిని, 13 కోట్ల నిధులను, బాలికల హాస్టల్ కోసం బుద్వేల్‌లో 12 వందల గజాల స్థలాన్ని కేటాయించడమంటే అగ్రవర్ణాలలో పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి ఎనలేనిదన్నారు. విద్యార్థులు శ్రమను ఆయుధంగా చేసుకుంటే విజయం బానిసగా మారుతుందని అన్నారు.
రెడ్డి జన సంఘం సలహాదారులు ప్రొఫెసర్ కంచర్ల దశరథరెడ్డి, అధ్యక్షులు వేమిరెడ్డి నర్సింహారెడ్డిలు మాట్లాడుతూ రెండేళ్ళ పాటు కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. ఈ యేడాది 268 విద్యార్థులకు రూ.22 లక్షల 23వేల ఉపకార వేతనాలను అందించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జన సంఘం ఉపాధ్యక్షులు తీగల బాల్‌రెడ్డి, గౌరి వెంకటరామిరెడ్డి, ఏ.సుకన్యారెడ్డి, పి.స్వరూపారాణి, కార్యదర్శి బి.మధుసూదన్ రెడ్డి, కోశాధికారి వి.వీరారెడ్డి, రెడ్డి బాయ్స్ హాస్టల్ చైర్మన్, టామ్‌కామ్ మాజీ చైర్మన్ బోయపల్లి రంగారెడ్డి, సంఘం సభ్యులు తీగల మోహన్‌రెడ్డి, మర్రి ప్రభాకర్‌రెడ్డి, ఎం.భారతి, మర్రి వామన్ రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, ఎస్.జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.