ఉస్మానియా యూనివర్సిటీ, మే 7: ‘చెల్లని నాణేనికి గీతలెక్కువ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మొరుగుడెక్కువ’ అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానిస్తూ మాట్లాడిన రేవంత్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చిల్లర ఖర్చులకు తెచ్చుకుని, తాగే జీవితాలు ఓయూ విద్యార్థులవి కాదని, పెయింటర్‌గా తన పూర్వ జీవితం గుర్తుకు వచ్చి రేవంత్ మాట్లాడి ఉంటాడని అభిప్రాయపడ్డారు. ఓయూ విద్యార్థులు అడ్డ మీద కూలీల లాంటివాళ్లని వ్యాఖ్యానించడం ఆయన చిల్లర వ్యక్తిత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు వెరువకుండా పోరాడిన గొప్ప చరిత్ర ఓయూ విద్యార్థులదని, అదే సమయంలో సమైక్యాంధ్ర నినాదంతో ఏకే 47 తుపాకీతో ఉద్యమకారులను బెదిరించిన నీచ చరిత్ర రేవంత్‌దని ఎద్దేవా చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం విద్యార్థులకు ఆయన అలాగే డబ్బులు ఇస్తున్నారా? సమాధానం చెప్పాలని నిలదీశారు. రేవంత్ అవమానకర వ్యాఖ్యలను మిత్తితో సహా ఓయూ విద్యార్థులు చెల్లిస్తారన్నారు.