సిటీబ్యూరో, మే 7(నమస్తే తెలంగాణ): ఓ ఆగంతకుడు స్టార్ మేకర్స్ యాప్ ద్వారా తన ఫోన్ నంబర్‌ను సేకరించి అసభ్యకరంగా వాయిస్ మెసేజ్‌లు పంపుతున్నాడని, ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరించాడని ఓ టాలీవుడ్ నటి సైబరాబాద్ షీ టీమ్స్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన షీ టీమ్స్ వేధింపులకు పాల్పడ్డ ఆ వ్యక్తిని అరెస్టు చేసి కటకటాలకు పంపింది. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ నాసారపు వెంకటేశ్‌ను జైలుకు పంపింది. ఇలా షీటీమ్స్ అతివలకు ఎల్లవేళలా అండగా ఉంటున్నది. మేమున్నాం.. మీకేం కాదంటూ.. భరోసా కల్పిస్తున్నది. కాగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో సైబరాబాద్ షీటీమ్స్ ఏకంగా 1003 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించింది. 248 మంది ప్రత్యక్షంగా దొరికిపోయారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో మఫ్టీలో ఉండి…75 మంది ఈవ్ టీజర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సైబరాబాద్ షీ టీమ్స్‌కు వాట్సాప్-269, నేరుగా ఫిర్యాదులు-30, ట్విట్టర్-8, హాక్-ఐ-7, ఈ-మెయిల్-5, ఉమెన్ సేఫ్టీవింగ్కు -36 ఇలా మొత్తం 355 ఫిర్యాదులు అందాయి. 319 మందికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వగా, వీరిలో 81 మందిపై క్రిమినల్, పెట్టీ కేసులు, 117 వార్నింగ్ కేసులను నమోదు చేశారు.