సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సఖీ సెంటర్లో సేవలను మరింత బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సఖి సెంటర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన సఖీ సెంటర్ అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు.
హింసకు గురైన మహిళలకు మద్దతుగా సహాయాన్ని అందించడం, ఇంటర్ ఏజెన్సీ నెట్‌వర్క్‌ల సహకారంతో టీమ్‌గా పని చేయడం, ఆపదలో ఉన్న మహిళలకు పునరావాసం కల్పించడం వంటి పలు అంశాలపై చర్చించారు. సఖీ సెంటర్ ఆధ్వర్యంలో 2,686 కేసులు నమోదైనట్లు మేనేజింగ్ కమిటీ సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో జడ్జి మురళీకృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్నేహ మెహ్ర, ఎంఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శిల్ప, సఖీ సపోర్టు ఏజెన్సీ డైరెక్టర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.