వ్యవసాయ యూనివర్సిటీ , నవంబర్ 5: కరోనా పరిస్థితులు ప్రజలను ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా చేశాయి. సంపాదన, స్థిరాస్తి ఎంత ఉన్నా.. మనిషికి ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనే విషయాన్ని గుర్తు చేశాయి. ఈ క్రమంలో నగరంలో ఉన్న చాలా మంది ప్రజలు ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో మన ఇల్లు.. మన కూరగాయలు అనే కాన్సెప్ట్‌తో మిద్దె తోటల పెంపకానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మహిళలకు మిద్దె తోటల పెంపకంపై శిక్షణ ఇవ్వడమే కాకుండా.. పురపాలక పరిధిలో మిద్దె తోటల పెంపకానికి ప్రోత్సాహకాన్ని కూడా ప్రకటించింది. ప్రజల ఆరోగ్య అవగాహనకు సర్కారు ప్రోత్సాహం తోడు కావడంతో నగరంలో మిద్దె తోటల పెంపకం విపరీతంగా విస్తరించింది.
ఇంటిపైన, పరిసరాలు, బాల్కనీల్లో తోటల పెంపకం వల్ల ఆరోగ్యమైన ఆహారం మాత్రమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం కూడా లభిస్తున్నది. విశ్రాంత ఉద్యోగులు, గృహిణులు ఇది ఒక మంచి వ్యాపకంగా పెట్టుకుంటున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ కుటుంబానికి సరిపడా కూరగాయలను పండిస్తున్నారు. అంతేకాకుండా రోజూ ఆ కూరగాయలతోనే వంట చేస్తూ ఆ రుచికి ఫిదా అవుతున్నారు. వృథాగా పడేసే ప్లాస్టిక్ టబ్బులు, వాటర్ బాటిళ్లు, డబ్బాలు, పీవీసీ పైపులు, కుండీలను వినియోగిస్తూ స్థలానుగుణంగా కూరగాయలు, ఆకుకూరలు, పూలు పండిస్తున్నారు. కాస్త ఎక్కువ స్థలం అందుబాటులో ఉంటే మునగ, కరివేపాకు, తీగ సాగు పంటలను విస్తరిస్తున్నారు. రసాయన ఎరువులు లేకపోవడం వల్ల ఆహారపదార్థాలు విషతుల్యం కాకుండా పోషక విలువలతో కూడిన దిగుబడి వస్తున్నది. మిద్దె తోటల పెంపకంతో ప్రతి ఇల్లు ఓ నందనవనంలా కనిపిస్తున్నది.
మా వంట రుచే వేరు..
కరోనా కాలం నుంచి ఇంటి అవసరాల కోసం కూరగాయలు, పూల మొక్కలు, ఆకు కూరలు పెంచుతున్నాను. టమాట 20 మొక్కలు, కాకర 3, కరివేపాకు, చిక్కుడుతో పాటు, రెండు వరుసలు పాల కూర, కోతిమీర, పుదీన, మునగ చెట్టు, రెండు వరుసలు బంతి పూలు వేశాను. మా ఇంట్లో ఇప్పుడు పూజకు సరిపడా పూలు, తిండికి సరిపడా కూరగాయలు ఉంటున్నాయి. మా ఇంటి కూరగాయలు తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది.
– లావణ్య,కౌన్సిలర్,తుక్కుగూడ
ఇష్టంగా మొదలుపెట్టాను..
నాది వ్యవసాయ కుటుంబం. మా ఆయన ఉద్యోగరీత్యా నగరానికి వచ్చాను. ఏడేండ్ల క్రితం ఇష్టంగా పెరటి తోటలు పెంపకం మొదలెట్టాను. పశువుల ఎరువులు, నీమాయిల్, అల్లం, పుల్లటి మజ్జిగ, బెల్లం, సీతాఫల్ కషాయంతో మంచి ఫలితాలు సాధించాను. కరోనా పరిస్థితులలో మాకు మంచి కూరగాయలు, పండ్లు, పూలు దొరికాయి. మిద్దె తోటలపై మహిళలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకున్నాను.
– కొంపెళ్ల జయలక్ష్మి, గెస్టు ఫ్యాకల్టీ, ఎల్బీనగర్
మిద్దె తోటల పెంపకంపై శిక్షణ
మిద్దె తోటల పెంపకంపై ప్రజల్లో అవగాహన పెరగాలని అగ్రి హార్టికల్చరల్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఏవీ రావు అన్నారు. పబ్లిక్‌గార్డెన్ ప్రాంగణంలోని అగ్రి హార్టికల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో టెర్రస్ గార్డెనింగ్పై రెండు రోజుల శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులకు హాజరైన అభ్యర్థులకు శిక్షకుడు రవిచంద్ర మిద్దె తోటల పెంపకంపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీరంగారావు, సంయుక్త కార్యదర్శి ఎ.సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.