కుత్బుల్లాపూర్,జూలై29: ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను వీధివ్యాపారులు సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ మంగతాయారు కోరారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో యూసీడి ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టన ప్రగతిస్ట్రీట్ వెండర్స్-అభివృద్ధి-స్వనిధి మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా 13 మందికి చింతల్ యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో రూ.2 లక్షల 20 వేల విలువ గల చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా డీసీ మంగతాయారు మాట్లాడుతూ వీధివ్యాపారులకు అందిస్తున్న ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకొని తమ వ్యాపారాలను మరింత విస్తరించుకోవాలని, దీంతో పాటుగా నిత్యం తమ వ్యాపార లావాదేవిలను కేవలం డిజిటల్ ట్రాంజక్షన్ల ద్వారా జరిపి ప్రతి నెల క్రమం తప్పకుండా తీసుకున్న రుణాలను చెల్లించి మరింత ఎక్కువ మొత్తంలో రుణాలను పొందేందుకు అవకాశం ఉందని వివరించారు.
ఈ సందర్భంగా చెక్కుపత్రాలతో పాటు ప్రతి నెల రుణాలను చెల్లిస్తున్న వీధివ్యాపారులకు ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో వీధివ్యాపారుల సంఘం ప్రతినిధి శాలివాహన, తెలంగాణ గ్రామీణ బ్రాంచ్ మేనేజర్ సురేశ్, పేట్ బషీరాబాద్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్ అధికారులు, సీఓలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.