అంబర్‌పేట / గోల్నాక, ఆగస్టు 24: కలుషిత మంచినీటి సమస్య నివారణకు చర్యలు తీసుకుంటానని ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ పోచమ్మబస్తీలో కొన్ని రోజులుగా నల్లాల్లో కలుషిత మంచినీరు సరఫరా అవుతున్నది. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు నీటి సరఫరా జరిగే పోచమ్మబస్తీలో జలమండలి డీజీఎం విష్ణువర్ధన్‌రావు, మేనేజర్ మాజిద్, వర్క్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణలతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు.
ఇంటింటికీ తిరిగి నీటి సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. మురుగునీరు వస్తుందని, నీటిని తాగలేకపోతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీరు ఎక్కడ కలుషితమవుతుందో వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని జలమండలి డీజీఎం విష్ణువర్ధన్‌రావు, మేనేజర్ మాజిద్లకు చెప్పారు. ఇంటింటికీ వెళ్లి నీటిని పరిశీలించాలని తెలిపారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని బస్తీవాసులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు కెంచె మహేశ్ పాల్గొన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి డివిజన్ల వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. బుధవారం అంబర్‌పేట డివిజన్ ఆకాశ్నగర్లో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో పాటు పలు శాఖల అధికారులతో కలసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు.
ముఖ్యంగా డ్రైనేజీ, లో-ప్రెషర్ మంచి నీటి సమస్య, విద్యత్వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుతో పాటు బస్తీలో రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే డ్రైనేజీ సమస్యతో పాటు సరిపడా మంచినీటి సరఫరా చేయాలని, రహదారులకు ప్యాచ్‌వర్క్ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్దార్థ్ముదిరాజ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ బతుకమ్మకుంటకు చెందిన జి. నిర్మలకు దళితబంధు పథకం మంజూరైంది. దీని కింద ఆమె కిరాణా అండ్ జనరల్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. ఈ దుకాణాన్ని బుధవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సునీల్, కోట్ల శివకుమార్, నవీన్‌యాదవ్, బి.శంకర్, బి.వి. రమణ పాల్గొన్నారు.
కాచిగూడ : యువకులు వరకట్నం తీసుకోకుండా వివాహం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. నల్లకుంట డివిజన్లోని గోల్నాక ఖర్కానలైన్ ప్రాంతానికి బోగ చిరంజీవి కట్నం తీసుకోకుండా పెదింటి అమ్మాయి కావ్యను పెండ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, నల్లకుంట కార్పొరేటర్ వై.అమృత, టీఆర్ఎస్ నగర నాయకుడు దూసరి శ్రీనివాస్‌గౌడ్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు బోగ చిరంజీవిని అభినందించి సన్మానించారు. శ్రీ సాయి గణేశ్ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్, బ్యాంక్ స్వామి, ప్రభాకర్, సత్యనారాయణ, నగేశ్, అంబాదాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.