కీసర, జూలై 29: కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రావణమాసం పూజలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ప్రారంభమైన శ్రావణమాస పూజలు ఆగస్టు 27వ తేదీ వరకు జరగనున్నాయి. మొదటి రోజు పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ దంపతులు గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రావణమాసం పూజలను ప్రారంభించారు.
గర్భాలయంలో స్వామికి వేదపండితులు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పంచామృతాలతో స్వామికి ప్రత్యేకంగా అభిషేకం చేశారు. భక్తుల సౌకర్యార్థం కీసరగుట్టలో ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
బోడుప్పల్, జూలై29: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని మాతానిమిషాంబికా దేవి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి 5 వందల చీరలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయంలో ఉదయం నుంచి సుప్రభాతం, అభిషేకం, అలంకరణ అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నగర ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్, జూలై 29 : శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. శుక్రవారంతో శ్రావణమాసం ప్రారంభం కావడంతో వివిధ ఆలయాలకు భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. ఇళ్లలో మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. పలువురిని పిలిచి, పసుపు, కుంకుమను అందజేశారు.