జియాగూడ, జూలై 29 : వందఫీట్ల బైపాస్ రోడ్డులో పనులను చేపడుతున్నామని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ నర్సింహ అన్నారు. శుక్రవారం పురానాపూల్ వంతెన కింద వందఫీట్ల బైపాస్ రోడ్డులో సిబ్బందితో రహదారి పరిశుభ్రత పనులను ఆయన ప్రారంభించారు. జియాగూడ బైపాస్ రోడ్డులోని హనుమాన్ ఆలయం, పిలిమండం శివాలయం ప్రాంతాల్లో వరద ఉధృతికి దెబ్బతిన్న రహదారులలో ఆయన పర్యటించారు. ఫుత్పాత్లు, రహదారులపై బురద మట్టి రాళ్ల తొలగింపు పనుల కోసం జేసీబీతో పనులు నిర్వహించారు.
పిలిమండం శివాలయంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం మట్టి తొలగింపు పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురానాపూల్ వంతెన కింద వరదనీరు ప్రవాహం తగ్గడంతో రహదారిలో చిక్కుకున్న వాహనాలు బయటపడ్డాయి. పిలిమండలం శివాలయం, హనుమాన్ ఆలయం, శివాలయ ఘాట్, ఇచ్చాపూరి బోలేనాథ్ ఆలయాలు పరిసర ప్రాంతాలు చెత్తతో నిండిపోయాయని పేర్కొన్నారు. త్వరలోనే బైపాస్ రోడ్డును అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ముందస్తుగా రోడ్డు పనులు చేస్తున్నామని, సూచించిన మార్గంలోనే ప్రజలు ప్రయాణించాలన్నారు.