Hyderabad | హైదరాబాద్ అభివృద్ధి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. పదేండ్లలో మారిన నగర ఇమేజ్ను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పేందుకు నెటిజన్లు ప్రతి రోజూ వందలాది ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్.. హైదరాబాద్ అంటూ యూ ట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేస్తున్నారు.
యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్… ఇలా సోషల్ మీడియా వేదిక ఏదైనా సరే ఒక్కటే చర్చ హైదరాబాద్. మహానగరంలో గత పదేండ్లలో జరిగిన అభివృద్ధి, మారిన నగర రూపురేఖల ఫొటోలు సోషల్‌మీడియాను ముంచెత్తుతున్నాయి. నగరాభివృద్ధికి ఫిదా అయిన నెటిజన్లు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధిపై చర్చించుకుంటున్నారు. మెట్రో రైలు, సచివాలయం, కేబుల్ బ్రిడ్జి, ఫ్లై ఓవర్లు, ఐటీ కారిడార్, రహదారులు, పార్కుల ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. ట్విట్టర్లో ‘బ్రాండ్ హైదరాబాద్’ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు.
‘బ్రాండ్ హైదరాబాద్.. లవ్ యూ. నా నగరం, నా స్వస్థలం గురించి చెప్పుకొనేందుకు ఎప్పుడూ గర్వపడుతుంటాను. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల్లో పర్యటించాను. మన దేశంలోని మూడు నగరాల్లో నివసించాను. ఆ అనుభవంతో చెబుతున్నాను. నివసించేందుకు అన్ని విధాల అనుకూలతలున్న నగరం హైదరాబాద్. ఇక్కడ ఉండటం గర్వకారణం’ అంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు #BrandHyderabad హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌ను షేక్ చేసింది. ఇలా ఒకరో ఇద్దరో కాదు.. వేలాది మంది హైదరాబాద్ అభివృద్ధిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కదిపినా ఒక్కటే మాట. హైదరాబాద్‌ను డెవలప్ చేసినవారు కాకపోతే ఇంకెవరు అధికారంలోకి వస్తారు.. ఇంతకుమించి హైదరాబాద్‌ను ఎవరు అభివృద్ధి చేస్తారు. అందుకనుగుణంగా మారిపోయిన హైదరాబాద్ రూపురేఖలను నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. నానక్‌రాంగూడ, కోకాపేట, నార్సింగి, గోపన్‌పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల, మోకిల, శంకర్పల్లి, పటాన్చెరు, ముత్తంగి, కంది, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు మహానగరం విస్తరిస్తున్నదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వెలిసిన హౌసింగ్ సొసైటీలు, కొత్తగా నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులను ఉదహరిస్తున్నారు. ముఖ్యంగా దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్జి, ఐకియా నుంచి ప్రారంభమై గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా ఔటర్ రింగు రోడ్డుపైకి వెళ్లే మరో ఫ్లై ఓవర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, షేక్‌పేట-రాయదుర్గం బ్రిడ్జిల ఫొటోలు ట్విట్టర్లో వైరల్‌గా మారాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ రీల్స్ కాంటెస్ట్ నిర్వహించగా.. వందల మంది డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేశారు. 2050 నాటికి హైదరాబాద్‌ను టాప్-10 గ్లోబల్ నగరాల జాబితాలోకి చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుండటంతో రానున్న రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
హైదరాబాద్‌లోనే ఉన్నానా? లేదా న్యూయార్క్లోనా?
-సూపర్‌స్టార్ రజినీకాంత్
వావ్! ఐ లవ్ హైదరాబాద్. ఇక్కడ ఉన్నన్ని సౌకర్యాలు మరెక్కడా లేవు.
-ఓ నెటిజన్