కుత్బుల్లాపూర్/జీడిమెట్ల, జూలై 14: నగరంలో కల్తీకల్లు పంజా విసురుతోన్నది. ఇటీవల కూకట్పల్లి, బాలానగర్ పరిధిలోని కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు కాటేసింది. ఇది మరువక ముందే కుత్బుల్లాపూర్‌లోని కల్లు కాంపౌండ్‌లో కల్లు సేవించిన ఓ ఇద్దరు దంపతులు అస్వస్థకు గురికావడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ధరావత్ లచ్చిరాం (50), సాక్రిభాయ్(45) దంపతులు.. కుమారుడు నిశాంత్‌తో కలిసి ఆరు నెలల కిందట నగరానికి వలస వచ్చి సుభాష్‌నగర్ డివిజన్, రాంరెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు.
ఈ ముగ్గురు జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పలు కంపెనీల్లో రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కుమారుడు నిశాంత్.. రామ్ రెడ్డి నగ ర్, షాపూర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న కల్లు కాంపౌండ్ల నుంచి కల్లు ప్యాకెట్లను ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి తల్లిదండ్రులు లచ్చిరాం, సాక్రిభాయ్ లు కల్లు సేవించగా మిగిలిన కల్లును ఆదివారం సాయంత్రం తిరిగి సేవించారు.
దీంతో వారికి కాళ్లు, చేతులు లాగడంతో పాటు శరీరంలో కరెంట్ షాక్ తగిలిన ట్టు కావడంతోపాటు పిచ్చి చూపులు చూస్తూ ఉండడంతో ఆదివారం రాత్రి 108లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి సోమవారం ఉదయం తమ సొంత ఊరైన నిజామాబాద్‌కు వెళ్లారు. వారి ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడంతో కుటుంబ సభ్యులు వారిని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా.. ఆయా కల్లు కాంపౌండ్లలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ మాధవయ్య, డీటీఎఫ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డి, ఎస్ఐ రవితో పాటు జీడిమెట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు.
శాంపిల్స్ సేకరించాం : ఎక్సైజ్ సీఐ యాదయ్య
షాపూర్ నగర్, రామ్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో ఉన్న కల్లు కాంపౌండ్లలో పర్యటించి అందులో అమ్ముతున్న కల్లు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ తరలించామని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ యాదయ్య తెలిపారు. పరీక్షలు అనంతరం వచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.