సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో వ్యవస్థీకృత సైబర్ నేరాల నెట్‌వర్క్‌ను ఛేదించారని సైబర్ ్రక్రైమ్స్ అడిషనల్ సీపీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సైబర్‌క్రైమ్ పోలీసులు, హైదరాబాద్ సిటీ లా అండ్ ఆర్డర్ బృందాలతో కలిసి సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన 48 కేసులకు సంబంధించి 13 రాష్ర్టాల నుంచి 66 మందిని అరెస్ట్ చేశారు.
వీరితో కలిపి మే నెలలో సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా 74 మందిని అరెస్ట్ చేయగా వీరిలో పెట్టుబడి మోసానికి సంబంధించి 33 మంది, సోషల్‌మీడియా కేసుల్లో 4గురు, లోన్ఫ్రాడ్లో ఇద్దరు, ట్రేడింగ్ ఫ్రాడ్‌లో 7గురు, మ్యాట్రీమొనియల్ ఫ్రాడ్‌లో 12 మంది, జాబ్ మోసంలో ముగ్గురు, ఓటీపీ మోసంలో ఐదుగురు, ఏఫీకే ఫ్రాడ్‌లో ముగ్గురు, డేటింగ్లో ఒకరు, డిజిటల్ అరెస్ట్‌లో ఇద్దరు, కస్టమర్ కేర్‌లో ఒకరు, బిజినెస్ మోసంలో ఒకరు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కేసుల్లో వివిధ రాష్ర్టాల నుంచి అరెస్ట్ అయిన నిందితుల వివరాలు చూస్తే కర్ణాటక నుంచి 6 గురు, తెలంగాణ నుంచి 19 మంది, ఏపీ నుంచి 16 మంది, మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు, పశ్చిమబెంగాల్ నుంచి ముగ్గురు, ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురు, ఢిల్లీ నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఐదుగురు, గుజరాత్ నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి నలుగురు, ఒడిశా నుంచి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
నేరస్తుల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు 43 మొబైల్ ఫోన్లు, 32 సిమ్‌కార్డులు, 19 ల్యాప్‌లాప్‌లు, పది సంఖ్యల బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఒక చెక్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. మే నెలలో 25 కేసులకు సంబంధించి బాధితులు రూ.10,03,04,239 నష్టపోగా, రూ. 68,27,304 మొత్తాన్ని పోలీసులు బాధితులకు అందించారు. ఇదే సమయంలో జోనల్ సైబర్ సెల్స్ కు మొత్తం 2531 దరఖాస్తులు రాగా, వాటిలో 349 ఎఫ్ఐఆర్లు చేశామని, ఈ విచారణలో భాగంగా 18 కేసుల్లో 23 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సైబర్ క్రైమ్ విభాగం ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో క్రియాశీలంగా పనిచేస్తున్న 251 సోషల్‌మీడియా ఖాతాలు చట్టవిరుద్ధమైన, తప్పుదోవ పట్టించే కంటెంట్‌తో పనిచేస్తున్నాయని గుర్తించి వాటిని నిలిపివేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.