హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రానున్న కాలంలో హైదరాబాద్‌కు మూడో కన్నుగా మారనుందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా సింగపూర్, న్యూయార్క్‌లలో ఉన్నట్లు బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ) నిర్మాణ పనులను బుధవారం సీపీ పరిశీలించారు. ఆర్ అండ్ బీ ఇంజనీర్ పద్మనాభరావు, భవన కాంట్రాక్టు సంస్థ షాపూర్జీ పల్లోంజి ప్రతినిధులు సీపీ ఆనంద్ వెంట ఉన్నారు.
నాలుగు టవర్ల భవనం, 20 అంతస్తుల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక మ్యాప్‌లను ఆర్ అండ్ బీ, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా సీపీకి వివరించారు. ఈ భవనాలలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, విపత్తుల సమస్యలో సంక్షోభ నిర్వహణ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడి నుంచి ప్రభుత్వ సేవలు అందిస్తారు. భవనంలో భద్రత ప్రమాణాలు, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయాలతో పాటు సమావేశ మందిరాలు, అడిటోరియాలు, పార్కింగ్ ప్రాంతాలను సీపీ సందర్శించారు.
పనుల పురోగతి, పెండింగ్‌లో ఉన్న పనులపై సీపీకి ఇంజినీర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్ట్ పూర్తి కావడంలో జాప్యం జరగడానికి కారణాలను సీపీకి అక్కడి అధికారులు వివరించారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివిధ అంశాల అమలు కోసం వివిధ ఏజెన్సీలు, విక్రేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సీపీ సూచించారు. నగర పోలీసుల నుంచి పూర్తి సహకారం ఉంటుందని, మార్చి 31వ తేదీలోగా పనులన్ని పూర్తి చేసి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంబోత్సవానికి సిద్దంగా ఉంచాలని సీపీ ఆదేశించారు. సీపీ వెంట వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్, అడ్మిన్ డీసీపీ సునీతారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
Today i.e on 12-01-2022 made a detailed visit and review of the Police Command Control Centre coming up in Banjara Hills. This 20 floored structure is coming up as a crisis management center too, apart from operating as a command control center and CP Hyd City Office. pic.twitter.com/gLrkI5tpST
— C.V.ANAND, IPS (@CPHydCity) January 12, 2022