హైదరాబాద్: మహేశ్ బ్యాంక్ సెంట్రల్ సర్వర్‌ను హ్యాక్ చేసి సైబర్ క్రిమినల్స్ రూ.12.9 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈకేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు.
మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోంది. మొత్తం 12.9 కోట్లను 3 ఖాతాల్లోకి బదిలీ చేశారు. దేశవ్యాప్తంగా 120కి పైగా ఖాతాల్లోకి నగదు మళ్లించారు. ఇతర ఖాతాల్లోకి బదిలీ కాకుండా రూ.3 కోట్లు నిలిపివేశాం. ఖాతాలు తెరిచిన, తెరిపించిన వారి వివరాలు కూడా తెలిశాయి. హ్యాకింగ్‌కు ప్రధాన కారణం బ్యాంక్ సర్వర్‌లో సమస్యలే అని తెలిసింది. నిర్లక్ష్యంగా ఉన్నందుకు మహేశ్ బ్యాంక్‌పై కూడా కేసు నమోదు చేశాం. మహేశ్ బ్యాంకులో ఆన్లైన్ బ్యాంకింగ్‌కు సరైన సైబర్ భద్రత లేదు. ప్రజల డబ్బుతో వ్యవస్థ నడిచేటప్పుడు సరైన భద్రత ఉండాలి.. అని సీపీ స్పష్టం చేశారు.