తనకంటూ..గుర్తింపు రావాలని.. లగ్జరీ జీవితాన్ని అనుభవించాలనే అత్యాశతో మాఫీయాకు తెరలేపేలా స్కెచ్ వేశాడు..అనుచరులనూ ఏర్పాటు చేసుకున్నాడు.. తనకున్న పరిచయంతో ఓ నాటు తుపాకీ.. వంద బుల్లెట్లను బీహార్ నుంచి కొనుగోలు చేశాడు. బెదిరింపులు.. ల్యాండ్ సెటిల్మెంట్లకు దిగి రియాల్టర్‌గా అవతారమెత్తాడు… ఇదీ కాల్పుల ఘటనలో పోలీసులకు చిక్కి..జైలుపాలైన నరేశ్ బ్యాక్ గ్రౌండ్. సంచలనం సృష్టించిన గాజులరామారంలో నాటు తుపాకీతో గాల్లో కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడైన నరేశ్‌తో పాటు మరో 14 మందిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇన్చార్జి డీసీపీ కోటిరెడ్డి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. మరోవైపు నరేశ్ నుంచి ఇబ్బందులుపడ్డ బాధితులు కొందరు పోలీసులకు ఫోన్లు చేసి..తమ గోడును వెల్లబోసుకున్నారు.
-కుత్బుల్లాపూర్, ఆగస్టు 30
Gajularamaram | ఈ నెల 28న రాత్రి 1.30 గంటల ప్రాంతంలో సీహెచ్. పూర్ణిమ(35)తో పాటు అజయ్‌చంద్ర(28), గౌతమ్(24) ముగ్గురు కలిసి మల్లంపేట్ నుంచి స్కూటీపై గాజులరామారం వైపునకు వస్తున్నారు. మార్గమధ్యలో ఎల్ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పెట్రోల్ అయిపోయింది. బార్ మూసి ఉండటంతో దాని ఎదురుగా ఉన్న బైక్ కనిపించింది. అందులో నుంచి గౌతమ్ దాని పెట్రోల్ దొంగతనం చేస్తుండగా, అప్పుడే బార్ నుంచి బయటకు వచ్చిన అఖిలేష్ అనే వ్యక్తి గమనించాడు. పెట్రోల్ ఎందుకు దొంగలిస్తున్నావంటూ మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బార్లో పని చేసే మిగతా వర్కర్లు కూడా బయటకు రావడంతో ఘర్షణ ముదిరింది.
దూరంగా ఉన్న పూర్ణిమ వెంటనే నరేశ్, శివకు ఫోన్ చేసి.. గౌతమ్‌తో ఎవరో గొడవపడుతున్నారని తనకు భయంగా ఉన్నదని.. తొందరగా రావాలని చెప్పింది. ఈ క్రమంలో నరేశ్, శివ వాహనంలో అక్కడి చేరుకున్నారు. నరేశ్ అనుచరులు సోహెల్, శ్యాంసన్, నరేందర్, ఉజ్వల్ మరో వాహనంలో వచ్చారు. వచ్చిరాగానే నరేశ్ అనుచరులు బార్కి చెందిన అఖిలేశ్, నిశాంత్, బార్ వర్కర్లతో గొడవ పడుతున్న సమయంలో నరేశ్ ఆదేశాల మేరకు శివ తన దగ్గర ఉన్న నాటు తుపాకీతో గాల్లో కాల్చాడు. భయంతో బార్లో పని చేసే అఖిలేశ్, నిశాంత్, వర్కర్లు పారిపోతుండగా, మరోసారి శివ అఖిలేశ్ వైపునకు కాల్పులు జరిపాడు.
అఖిలేశ్ తప్పించుకొని బార్ వెనక వైపునకు పరిగెత్తాడు. కారును నరేశ్ అతివేగంతో నిశాంత్ మీదకు దూసుకెళ్లగా కారు ముందు భాగం తగలడంతో అతడి కాళ్లు, ఎడమచేతికి తీవ్రగాయాలై చెట్లలో పడిపోయాడు. వేగంగా ముందుకెళ్లిన కారు చెట్ల మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనపై నరేశ్ తన అనుచరులు అదే రోజు రాత్రి జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి బార్లో పని చేసే వారిపై అజయ్చంద్రతో ఫిర్యాదు చేయించి వెళ్లిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయం బార్లో పని చేసే అఖిలేశ్ స్థానిక జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కాల్పుల విషయం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరారీలో ఉన్న నరేశ్‌ను కూకట్‌పల్లిలో పట్టుబడటంతో పాటు అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారించగా, ఈ గ్యాంగ్ దందాలు బయటకు వచ్చాయి.
పలు దందాలు చేసిన నరేశ్‌పై దుండిగల్ పీఎస్‌లో ఐదు, సంగారెడ్డి పీఎస్‌లో ఒక కేసు నమోదైంది. కొందరు బాధితులు పోలీసులకు ఫోన్లు చేసి..తమ గోడును వెల్లబోసుకున్నారు. విచారణలో నరేశ్ భూదందాలు, సెటిల్మెంట్లు, బెదింపులకు పాల్పడుతుండేవాడని తేలింది. పోలీసులు మొత్తం 15 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి నాటు తుపాకీ, 87 బుల్లెట్లు, వాహనాలను సీజ్ చేసినట్లు డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.