Habsiguda | ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 17: హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ..ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టడంతో పదో తరగతి విద్యార్థిని దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలోని కిమ్టీ కాలనీలో నివాసముండే రంగ గోపీనాథ్గౌడ్ కూతురు సాత్విక (15) హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నది. శనివారం రోజు మాదిరిగానే ఆటోలో పాఠశాలకు బయలుదేరింది.
హబ్సిగూడ సిగ్నల్ సమీపిస్తుండగా, ముందు ఉన్న బస్సు నిలిపివేయడంతో దాని వెనకాలే డ్రైవర్ ఆటోను ఆపాడు. అంతలోనే వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బస్సు కిందకు దూసుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్రేన్ సహాయంతో ఆటోను బయటకు తీశారు. అందులో ఉన్న సాత్విక, డ్రైవర్ ఎల్లయ్యను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాత్విక చనిపోయింది.
అండగా నిలువాలి: రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య
హబ్సిగూడ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ను రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య పరామర్శించారు. అనుమతి లేకుండా నగరంలోకి ప్రవేశిస్తున్న భారీ వాహనాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. మృతిచెందిన విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
హోం మంత్రిని నియమించాలి: బీఎస్ఎం ఆటో రవాణా సంఘం
ప్రత్యేకంగా హోం మంత్రిని నియమించకపోవడంతో పోలీసుల్లో నిర్లక్ష్యం ఏర్పడిందని బీఎస్ఎం ఆటో రవాణా సంఘం నాయకులు రవిశంకర్ ఆరోపించారు. భారీ వాహనాలకు స్కూల్ వేళల్లో హైదరాబాద్లో అనుమతి లేదన్నారు. ట్రక్ ఓనర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని, ఆటోడ్రైవర్ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.