Hyderabad | హైదరాబాద్ : శ్రీ సీతారాముల కల్యాణానికి( Sitaramula Kalyanam ) హైదరాబాద్( Hyderabad ) నగరం సిద్ధమైంది. భాగ్యనగరంలోని ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రామాలయాల( Ramalayam )తో పాటు హనుమాన్ ఆలయాలను కూడా సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాలన్నీ రకరకాల పువ్వులతో అలంకరించారు. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.
పాతబస్తీలోని సీతారాం బాగ్ ఆలయం అత్యంత ఫేమస్. ఈ ఆలయంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరగనుంది. ఇక కల్యాణాన్ని వీక్షించేందుకు రామ భక్తులు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. సీతారాముల కల్యాణం ఆదివారం ఉదయమే జరగనుంది. ఇక మిగతా ఆలయాల నిర్వాహకులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కూడా తమ ప్రాంతాల్లో సీతారాముల కల్యాణం జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
సీతారాం బాగ్ టెంపుల్ నుంచి శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. శోభాయాత్ర మంగళ్‌హాట్, పురానాపూల్ గాంధీ విగ్రహం, జుమ్మెరాత్ బజార్, సిద్దంబర్ బజార్, అఫ్జల్‌గంజ్, గౌలిగూడ, కోఠి ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్ మీదుగా హనుమాన్ వ్యాయమశాల గ్రౌండ్‌కు చేరుకోనుంది. ఈ శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్స్, సీసీటీవీ కెమెరాలతో శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు.