ఎర్రగడ్డ, సెప్టెంబర్ 19: మినీ ఇండియాగా పేరు గాంచిన హైదరాబాద్ నగరం మత సామరస్యానికి చిరునామాగా వెలిసిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. బోరబండలో గురువారం జరిగిన ‘మిలాద్-ఉన్-నబీ’ ఊరేగింపు సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. మైనార్టీ సోదరులు మాగంటిని సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బోరబండ ప్రాంతంలో దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థిరపడి సోదరభావాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. ప్రధానంగా రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ లాంటి పండుగలను ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు.
అంతకు ముందు మైనార్టీ సోదరుల భారీ ఊరేగింపు వీకర్ సెక్షన్ నుంచి మొదలైంది. హైటెక్ హోటల్, సైట్-3, సైట్-2, స్వరాజ్నగర్ బోరబండ బస్ టెర్మినల్ చౌరస్తా మీదుగా ముందుకు వెళ్లింది. ఊరేగింపు అనంతరం సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహ్మద్ సర్దార్, మొయిజ్, షరీఫ్, ఖదీర్, మహ్మద్ యూసుఫ్, ముక్రమ్, తౌఫిక్, ఇలియాస్, జుబేర్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణమోహన్, పార్టీ నేతలు ఎన్.విజయ కుమార్, ఇర్ఫాన్, ఖలీల్, ధర్మ, బాబూరావు, పాష పాల్గొన్నారు.