సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : విపత్తు నిర్వహణలో ప్రభుత్వ శాఖల సమన్వయ అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అటు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ముందస్తు చర్యలతో పాటు సహాయక చర్యలను వేగిరం చేసేలా అధికార యంత్రాంగం సంసిద్దంగా ఉండాలి.. అప్పుడే ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా ప్రజల ఇబ్బందులను సకాలంలో తొలగించిన వారవుతారు. కానీ ప్రజాపాలనలో శాఖల మధ్య సమన్వయం లోపం కొట్టొచ్చినట్లుగా కనబడుతున్నది.. హైదరాబాద్ నగరంలో గంట వ్యవధిలోనే 32 సెంటీమీటర్ల వర్షం కురిసిన చరిత్ర.. కానీ 13 సెంటీమీటర్లకే ప్రభుత్వ శాఖలు ఆగమాగం అయి ప్రజానీకాన్ని ముప్పుతిప్పలు పెట్టిస్తున్నది.. రెయిన్ అలర్ట్ విషయంలో వాతావరణం ఒకటి చెబితే.. హైడ్రా మరొకటి చెబుతూ ప్రజలను గందరగోళంలోకి నెట్టెస్తున్నది.. దీని అట్నుంచితే క్షేత్రస్థాయిలో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖను కలుపుకోవడంలో ఘోరంగా విఫలం చెందుతున్నాయి.
ఫలితంగా కాలనీలు, ప్రధాన రోడ్లపై వరద నీరు ముంచెత్తుతున్నది. నాలాల్లోకి వెళ్లాల్సిన వరద రోడ్లపై ఉప్పెనలా పోటెత్తడంతో వాహనాలు నీటిపై తేలియాడుతున్నాయి. నడుం లోతు నీళ్లలో వాహనదారులు చిక్కుకుని తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అపార్టుమెంట్లు సెల్లార్లు చెరువుల్లా మారుతున్నాయి. ప్రత్యేకంగా ట్రాఫిక్ వెతలు వర్ణనాతీతం. మొత్తంగా వర్షంలోనే కాకుండా వర్షానంతరం తీసుకోవాల్సిన చర్యల్లోనూ ఆదే నిర్లక్ష్యపు వైఖరీ ప్రదర్శిస్తుండడంతో వరదతో పాటు బురదలోనూ సామాన్యుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు…ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం? ప్రజలకు ఎదురవుతున్న కష్టాలను ఒకసారి పరిశీలిస్తే…
కాలికి పుండు అయిందని మొత్తం కాలినే తీసేసినట్లుగా..మాన్సూన్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ ఆమలులో జీహెచ్ఎంసీ విఫలమైందని సర్కారు ఈ ఏడాది వర్షాకాల బాధ్యతలు హైడ్రాకు అప్పగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మాన్సూన్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్‌ను జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు ప్రభుత్వం బదలాయించింది. గత నెల 9వ తేదీన జారీ అయిన మెమో ప్రకారం ఏ ఏ పనులు చేయాలో పేర్కొంటూ హైడ్రాకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా సూచించారు. క్యాచ్పిట్ల మూతలపై పేరుకుపోయిన చెత్తాచెదారాలు తొలగించడం, అవసరాన్ని బట్టి ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు చేపట్టాలి. నాలా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. వర్షాలు వెలిశాక నాలాల్లో పూడిక తీత పనులు చేయాలి. రోడ్లపై ఉండే పూడిక తొలగించాలి.
వరద నీరు నాలాల్లోకి సాఫీగా వెళ్లేందుకు ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగించడం, రోడ్లపై పడే విద్యుత్ స్తంభాలు, చెట్ల కొమ్మలు తొలగించాలి. కానీ ఈ పనులను హైడ్రా ఎంఈటీ బృందాలు ఆయా శాఖలు జలమండలి, విద్యుత్, జీహెచ్ఎంసీల ఇంజనీర్లతో కలిసి పనిచేయాలి. కానీ అలా జరగడం లేదు. తమ వైపు నుంచి చేయాల్సిన పనులు చేస్తున్నామని జీహెచ్ఎంసీ ఇంజినీర్లు చెబుతున్నారు. తాము హైడ్రాకు సహకరిస్తున్నప్పటికీ వారి నుంచి ఉండాల్సిన స్పందన ఉండడం లేదని ఆరోపిస్తున్నారు. హైడ్రా అధికారులకు నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో, అక్కడి నుంచి వాన నీరు ఏ నాలాలోకి వెళ్తుందో వారికి ఎన్నో పర్యాయాలు తెలియజేమంటున్నారు.
నగరంలో ప్రస్తుతం ఉన్న 141 వాటర్ లాగింగ్ ప్రాంతాల వివరాలు అందజేశామని చెబుతున్న జీహెచ్ఎంసీ…వాటర్ లాగింగ్ పాయింట్లలో హైడ్రా ఏం చేస్తుందో అర్థం కావడం లేదని స్థానికులు బలంగా ప్రశ్నిస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్లతో పాటు క్యాచ్పిట్ల వద్ద, ఫుట్‌పాత్‌ల పక్కన పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాల్సి ఉండగా, ఆ పనులు జరగడం లేదని కొందరు స్వయంగా జీహెచ్ఎంసీ ఈఈలు ఆరోపిస్తుండడం గమనార్హం. సిల్ట్ తొలగించకపోవడంతో క్యాచ్పిట్లలోకి నీరు వెళ్లక రోడ్లు చెరువులయ్యే ప్రమాదం ఉంటుందని, వర్షం వెలిసిన సమయాల్లో ఈ పనులు చేయాల్సి ఉన్నప్పటికీ అవి జరగడం లేదని చెబుతుండడం విశేషం.
ప్రతి ఏడాది దాదాపు రూ.55 కోట్ల మేర నాలా పూడికతీత పనులకు టెండర్లు పిలిచి వర్షాకాలం తొలకరి జల్లులు కురిసే నాటికల్లా పూడికతీత పనులను పూర్తి చేసి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలి. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ నిర్వహణ విభాగం మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. గత డిసెంబర్ నెలలో నాలా పనులకు టెండర్లు ముగించాల్సిన అధికారులు మార్చి మొదటి వారం వరకు కొన్ని చోట్ల టెండర్లతోనే కాలాయాపన చేసింది. ఇప్పటి వరకు నాలా పూడికతీత పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ 94 శాతం కూడా పూర్తి చేసుకోకపోవడం అధికారుల పనితీరుకు అర్థం పడుతున్నది. ఈ ఏడాది రూ.55.04 కోట్లతో 203 చోట్ల పనులకు గానూ 951.71 కిలోమీటర్ల పొడవున పూడికతీత చేపట్టాల్సిన ఉండగా, ఇప్పటి వరకు 886 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేయడం గమనార్హం.
భారీ వర్షానికి రోడ్లపై, కాలనీల్లో కొట్టుకువచ్చిన బురద, ఇసుక, ఇతర వ్యర్థాలను తరలించడంలో జీహెచ్ఎంసీ విఫలమవుతున్నది. రోడ్లపై ఇసుక మేటలతో వాహనాలు స్కిడ్ అవుతూ వాహనదారులు కింద పడిపోయి గాయలపాలవుతున్నారు. అంతేకాకుండా ఆమీర్‌పేట, ఎల్లారెడ్డి గూడ, రాంనగర్ లాంటి ప్రాంతాలు వరద కష్టాలు నుంచి తేరుకోవడం లేదు. రాంనగర్లో ఓ శిథిలావస్థ ఇళ్లు కూలిపోయింది. ఈ క్రమంలోనే సీఆర్ఎంపీ రోడ్లతో పాటు కాలనీల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. స్విపింగ్ యంత్రాలను వినియోగించని ఫలితంగా రోడ్లపై చెత్త, చెదారం పేరుకుపోతున్నది. వీటికి తోడు నగరంలో డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి.
పైపులు లీకవుతున్నాయి. మురుగునీటి నాలాల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి మురుగంతా వీధులను ముంచెత్తుతున్నది. ఇంకోవైపు దుర్గంధంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మరోవైపు నగరవాసులకు అంటువ్యాధుల ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఖైరతాబాద్‌లోని మారూతినగర్ వెంకట మహాలక్ష్మి దేవాలయం రోడ్డు, ఎన్టీఆర్ ట్రస్ట్ పక్క వీధిలో రోడ్డుపై పేరుకుపోయిన బురద, జూబ్లీహిల్స్ డివిజన్ జవహర్ కాలనీలో మురుగు ఏరులై పారుతున్నా జలమండలి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో డెంగీ విస్తరిస్తుండగా, అధికారుల తీరు తమను ఆస్పత్రి పాల్జేస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.