వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 1: తెలంగాణ పునర్నిర్మాణానికి సమష్టిగా కృషిచేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందుకు వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధ్యాపకులు ప్రొ. జి.హరగోపాల్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం (టీఏఎస్ఏ), బోధనేతర సిబ్బంది సంఘం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడే పౌరుల గొంతుక ప్రభుత్వానికి వినిపించే అవకాశాలున్నాయన్నారు. విశ్వవిద్యాలయాలు చైతన్యవంతంగా ఉంటే పౌర సమాజం బాగుంటుందన్నారు. ప్రభుత్వాలు నిరంతరం ప్రజలతో చర్చలు కొనసాగిస్తుండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులలో అధిక శాతం సన్న చిన్న కారు రైతులున్నారని, వారి అభ్యున్నతిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ. ఎం.కోదండ రాం అన్నారు.
దేశంలోనే అధిక శాతం విత్తన బండాగారం తెలంగాణకే సాధ్యమని, అందుకు అనుగుణంగా వనరులున్నాయని సూచించారు. విశ్వవిద్యాలయాలను స్వేచ్ఛగా కొనసాగిస్తేనే మంచి ఫలితాలు పొందగలమన్నారు. విశ్వవిద్యాలయాలు పురోగతి దశలో నడిపితేనే అమరవీరుల త్యాగాలకు అసలైన నివాళి అని పీజేటీఎస్ఏయూ రిజిస్ట్రార్ పి.రఘురామిరెడ్డి అభిప్రాయ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇంకా టీఏఎస్ఏ అధ్యక్షలు డా. విద్యాసాగర్ , బోధనేతర సిబ్బంది సంఘం నాయకులు శ్రీనివాస్ యాదవ్ డా.వనమాల, ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె డా. జీవీ వెన్నెల పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధికారులు, బోధనా బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.