Central University | కొండాపూర్, జూన్ 11 : గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ప్లాటినం ర్యాంక్డ్ గ్రీన్ యూనివర్సిటీ గుర్తింపు సొంతం చేసుకుంది. యూనివర్సిటీలోని అడిట్ అండ్ అక్రిడిటేషన్ గవర్నెన్స్ అండ్ అకడమిక్స్, బిల్డింగ్ డిజైన్ అండ్ ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్, ఎనర్జీ యూజ్ అండ్ సేవింగ్స్, ఎయిర్ క్వాలిటీ లెవల్స్, హెల్త్ అండ్ హైజీన్, సస్టైనబుల్ రిసోర్స్ యుటిలైజేషన్ వంటి కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న మెంటర్లు వర్సిటీని గ్రీన్ యూనివర్సిటీ గుర్తింపునకు ఎంపిక చేశారు. ఈ ఎంపిక సందర్భంగా 500 పాయింట్లలో 445 పాయింట్లు సాధించి, స్థిరమైన క్యాంపస్ ప్రాక్టీస్‌లో హెచ్‌సీయూ నిలిచింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టాత్మక ప్లాటినం-ర్యాంక్డ్ గ్రీన్ యూనివర్సిటీ గుర్తింపు మా సంస్థ స్థిరత్వం, ఆవిష్కరణల పట్ల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. స్థిరమైన పద్ధతులలో పరిశోధన, విద్య సరిహద్దులను నిరంతరం ముందుకు తీసుకెళ్లిన మా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల అవిశ్రాంత కృషిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ ప్రశంసను అందుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఇది పచ్చదనం, మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు మా ప్రయాణాన్ని కొనసాగించడానికి మమ్మల్ని మరింత ప్రేరేపిస్తుందని పేర్కొన్నారు.