సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో 27 పురపాలికల విలీనంతో హైదరాబాద్ బృహత్ నగరంగా ఆవిర్భవించిందని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శుక్రవారం రాజేంద్రనగర్, గోల్కొండ జోనల్ కమిషనర్ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సమక్షంలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి, గోల్కొండ జోనల్ కమిషనర్గా ముకుందరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ నగర విస్తీర్ణం పెరగడంతో పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జీహెచ్ఎంసీ వార్డులను 150 నుంచి 300కు పెంచిందన్నారు. ఆరు జోన్లను 12కు, ప్రస్తుతం ఉన్న 30 ఉన్న సర్కిళ్లను 60కి పెంచినట్లు చెప్పారు. కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఏర్పాటయ్యాయన్నారు.