Minister Talasani | దేశంలో సినిమా, టీవీ రంగాలకు హైదరాబాద్ నగరం వేదికగా మారిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ చలన చిత్ర సంస్థ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ చలన చిత్ర పరిశ్రమ, టీవీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Talasani2
రాష్ట్ర ఆవిర్బావానికి ముందు అనేక అనుమానాలు, అపోహలు ఉండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత అవన్నీ తొలగిపోయాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలలో వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాదిమంది ఉపాధిని పొందుతున్నారని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిత్రపరిశ్రమలోని అనేకమంది సొంత ఇంటి కలను నెరవేర్చారని గుర్తు చేశారు. చిత్రపురి కాలనీలో కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేశారని అన్నారు. చిత్ర పరిశ్రమ, TV రంగంలోని వారిలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని అన్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ఒక ప్రణాళికతో పాలన సాగిస్తే అభివృద్ధి సాధ్యమని నిరూపించిన గొప్ప నాయకుడు మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, సినీ ప్రముఖులు జెమిని కిరణ్, బసిరెడ్డి, దాము, మాదాల రవి, రాజీవ్ కనకాల, చిత్రపురి కాలనీ అద్యక్షుడు అనిల్, నాగబాల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.