సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) మెట్రో ఫేజ్-2 విస్తరణపై హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్(హెచ్ఏఎంఎల్) కేంద్ర ప్రతినిధుల బృందంతో సమావేశమైంది. బుధవారం కేంద్ర పట్టాభివృద్ధి శాఖ అధికారుల బృందంతో జరిగిన భేటీలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో మెట్రో విస్తరణకు హెచ్ఏఎంఆర్ రూపొందించిన డీపీఆర్‌లోని పలు టెక్నికల్ అంశాలపై వివరణ ఇచ్చినట్లుగా తెలిసింది. కాగా కేంద్రం ఈ డీపీఆర్‌కు ఆమోదం తెలపాల్సి ఉంది.
అయితే ప్రాజెక్టులోని నిర్మాణపరమైన అంశాలపై సవివరంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించినట్లుగా తెలిసింది. కాగా ఇప్పటికే రెండు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో డీపీఆర్ విషయంపై మెట్రో అధికారులు చర్చించగా, తాజాగా ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో బుధవారం భేటీ కాగా, ఫైనాన్షియల్ అంశాలపై కూడా చర్చించినట్లుగా తెలిసింది. ప్రాథమిక అనుమతులిచ్చేలా చొరవ తీసుకునే పలు అంశాలపై మెట్రో అధికారులు కేంద్రానికి స్పష్టతనిచ్చారు.
ప్రస్తుతం భూసేకరణ దశలో ఉన్న 7.5 కిలోమీటర్ల ఓల్డ్ సిటీ మెట్రోకి కూడా ఇదే డీపీఆర్‌లో ఉండగా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే నిర్మాణ పనులు వేగంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. 116 కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించే మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వంతో మెట్రో అధికారులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో డీపీఆర్‌ను కేంద్రానికి చేరవేయగా ప్రస్తుత పరిశీలన దశలో ఉంది.
ఈ క్రమంలో హెచ్ఏఎంఎల్ ఫేజ్-2లోని ఐదు కారిడార్లుపై చర్చించారు. దాదాపు రూ. 24వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనుండగా ఇందులో కేంద్ర వాటాగా రూ. 4230 కోట్లు చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.7313 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మిగిలిన మొత్తాన్ని ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో తీసుకునేలా ఆర్థిక ప్రణాళికలు ఉండగా కేంద్ర ఆమోదంతో నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.
శామీర్‌పేట్ మెట్రో డీపీఆర్
ఫేజ్-2లోనే రెండో భాగంగానే జేబీఎస్ నుంచి శామీర్‌పేట్, మేడ్చల్ మార్గంలో నిర్మించేందుకు అవసరమైన డీపీఆర్ రూపకల్పన జరుగుతుంది. ప్రస్తుతం మరో నెల రోజుల వ్యవధిలోనే డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలో రెండో భాగానికి మే నెలలో కేంద్రానికి పంపించే అవకాశం ఉంది.