మలక్‌పేట, జూన్ 9 : మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లోని రైతుల క్యాంటీన్, విశ్రాంతి గదుల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడంతోపాటు మరుగు దొడ్ల నిర్మాణం, క్యాంటీన్, విశ్రాంతి భవనంలో వసతుల కల్పనకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్పర్సన్ ఆంగోతు అనితానాయక్ డీఈని ఆదేశించారు. గురువారం మార్కెట్ ఉపసంచాలకులు దామోదర్, మార్కెటింగ్‌శాఖ డీఈ, డైరెక్టర్లు పొలికాటి యాదగిరి, మహ్మద్ ఎజాజ్, సల్మాన్ మహ్మద్ ఖాన్‌లతో కలిసి రైతుల క్యాంటీన్, విశ్రాంతి గదులను ఆమె పరిశీలించారు.
క్యాంటీన్లో వంటకాలను పరిశీలించిన ఆమె రైతులకు నాణ్యమైన భోజనాలను అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్యాంటీన్, విశ్రాంతి గదులను నిర్మించినప్పటికీ, మరుగుదొడ్ల వసతి లేకపోవడం, క్యాంటీన్లో సరైన వసతులు కూడా లేవన్నారు.
క్యాంటీన్, విశ్రాంతి గదుల్లో పూర్తి స్థాయిలో వసతులు, మరుగుదొడ్ల వసతి కల్పించి రైతులకు వినియోగంలోకి తేనున్నట్లు తెలిపారు. డీఈ ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించగానే నిధులు సమీకరించి మరమ్మతులు, వసతులకు సంబంధించిన పనులను ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పొలికాటి యాదగిరి, మహ్మద్ ఎజాజ్, సల్మాన్ మహ్మద్ ఖాన్, గ్రేడ్-3 కార్యదర్శి రవిందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మలక్‌పేట, జూన్ 9 : మలక్‌పేట మార్కెట్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అభినందనీయులని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆంగోతు అనితా నాయక్ అన్నారు. మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో డ్రైనేజీ, రోడ్ల సమస్యల పరిష్కారానికి వచ్చిన మలక్‌పేట ఎమ్మెల్యే బలాలను ఆమె మార్కెట్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమస్యలు విన్నవించిన వెంటనే మార్కెట్ పర్యటనను ఖరారు చేసుకొని వచ్చి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించటం చాలా సంతోషకరమని అన్నారు.
దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాల నుంచి పంటలను తెచ్చె రైతులు, మురికినీటితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, పంటలు తడిసి పోతుండటంతో నష్టపోతున్నారని ఆమె తెలిపారు. వీలైనంత త్వరగా మార్కెట్లోని సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్, డైరెక్టర్లు కునతోడి అభిషేకం, పొలికాటి యాదగిరి, బట్కిరి విద్యానంద్, మైల రవికాంత్, చిన్నయ నరేశ్, సందసరి లలితా భాయి, సల్మాన్ మహ్మద్ ఖాన్, మహ్మద్ ఎజాజ్, ఎస్జీఎస్ దామోదర్, తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ అధ్యక్షులు దేవర రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి బట్కిరి వివేకానంద్, తెలంగాణ మిర్చి అసోసియేషన్ అధ్యక్షుడు వంజరి వినోద్, బట్కిరి రాజు, బండారు శ్రీనివాస్, సలహాదారుడు కట్టా మల్లేశం తదితరులు పాల్గొన్నారు.