సిటీబ్యూరో, అక్టోబరు 3(నమస్తే తెలంగాణ): ఆదివారం సాయంకాలం.. హుస్సేన్ సాగర తీరం ఒక తిరునాళ్లను తలపించింది. అక్కడేదో జాతర జరుగుతున్న ఉత్సవ వాతావరణం కనిపించింది. నగర వాసులు ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సందడి చేశారు. అంతర్జాతీయ నగరాల అందాలకు ఏమాత్రం తీసి పోని విధంగా హుస్సేన్‌సాగర్ తీర ప్రాంతాన్ని ప్రభుత్వం తీర్చిదిద్దడంతో నగర వాసులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
ట్యాంక్‌బండ్‌పై ‘సన్డే.. ఫన్ డే’ పేరుట ఇటీవల ప్రభుత్వం సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగర సందర్శకుల కోసం ట్యాంక్‌బండ్‌ను ట్రాఫిక్ ఫ్రీగా మార్చేశారు. వేలాది మంది సందర్శకులు, దేశ, విదేశీ పర్యాటకులు ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం సందడి చేశారు.
ఆకాశం అక్కడక్కడ మేఘావృతమై ఆహ్లాదకరమైన వాతావారణం ఉండటంతో కుటుంబ సమేతంగా వచ్చిన వారు ఎంతో ఎంజాయ్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఇలాంటి వాతావారణంలో కుటుంబ సమేతంగా గడపటం ఎంతో ఆనందంగా ఉందంటూ పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్ సెల్ఫీలకు భారీ స్థాయిలో కేంద్రంగా మారింది. వందలాది మంది సెల్ఫీలు తీసుకుంటూ సంబరపడ్డారు.
కుటుంబ సమేతంగా వచ్చిన సందర్శకులు హుస్సేన్‌సాగర్ మధ్యలో ఉన్న బుద్ధుడి వైపు చూస్తూ, చుట్టు పరిసరాలను తనివి తీరా తిలకించారు. రోడ్డంతా వాహనాలు లేకుండా ఉండటంతో అంతటా కలియతిరుగుతూ.. ఆడుతూ.. పాడుతూ.. చిందులు వేస్తూ.. వీడియోలు తీసుకున్నారు. ఈసారి ట్యాంక్‌బండ్‌పై ఒక కిలో మీటరు పొడవున్న జాతీయ పతాకాన్ని ప్రదర్శించడంతో సందర్శకులు చూసి ఎంతో మధురానుభూతి పొందారు.
నాలుగు ఆదివారాలుగా ట్యాంక్‌బండ్‌పై ‘సన్డే – ఫన్డే’ కార్యక్రమంతో రెట్టింపు సందడి కనిపించింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులు ఇంకా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ బ్యాండ్ తో పాటు 20 మందితో కూడిన కళాకారుల బృందం ట్యాండ్ బండ్ పొడవునా పులి వేషాలతో సందర్శకులను అలరించారు. ఇక చార్మినార్ ప్రాంతంలో ఉండే షాపింగ్ సందండి అంతా ట్యాంక్ బండ్‌పై కనిపించింది.
ట్యాంక్‌బండ్‌పై హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. హెచ్ఎండీఏ సెక్రెటరీ సంతోష్, అర్బన్ ఫారెస్ట్ విభాగం డైరెక్టర్ ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్ బీఎన్ఎన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు ఆధ్వర్యంలో ప్రసారం చేయనున్న మాయాద్వీపం షో రెండో ఎపిసోడ్‌ను ఆ సంస్థ ప్రతినిధులు ఆదివారం ప్రారంభించారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన వాచ్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మాయాద్వీపం ప్రదర్శన సందడిగా సాగింది. ప్రఖ్యాత నటుడు, మిమిక్రీ ఆర్టిస్టు నాగిరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించగా సరిగమ సింగర్స్ హుషారెత్తే పాటలతో అదరగొట్టారు.
జూబ్లీహిల్స్: సండే ఫన్డే కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ట్యాంక్‌బండ్‌పై యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్ సిబ్బంది బ్యాండ్ సందడితో ఆకట్టుకున్నారు. కమాండెంట్ ఏకే మిశ్రా, అసిస్టెంట్ కమాండెంట్ సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బ్యాండ్ ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.