Hyderabad | బేగంపేట్, ఫిబ్రవరి 11: భార్యతో గొడవ పడ్డ భర్త.. ఆమె పని చేసే షాపులోకి వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
మార్కెట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దోమలగూడ తాళ్ల బస్తీకి చెందిన శ్రవణ్, మౌనికకు 12 ఏండ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా జన్మించింది. ఆ తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో ఎనిమిది సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారు. కుమార్తె శ్రవణ్ వద్దనే ఉంటుంది. ఆదివారం రాత్రి మౌనిక పనిచేస్తున్న కామాక్షి సిల్క్ షాప్‌లోకి వెళ్లిన భర్త శ్రవణ్ ఆమెతో గొడవపడ్డాడు. అనంతరం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రవన్ణు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా శ్రవణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.