సిటీబ్యూరో, మార్చి 1(నమస్తే తెలంగాణ): అక్కడ అందానికో రేటు కడతారు. .. వయసుని బట్టి ధర నిర్ణయిస్తారు. యువతులు,మైనర్ బాలికల కుటుంబాల అవసరాలను బట్టి రేటులో తేడా చూపిస్తారు. ఏ దేశపు యువతులకైతే ఎక్కువగా ఎక్కడ డిమాండ్ ఉంటుందో ఆయా ప్రాంతాలకు రవాణా చేస్తారు. కోల్‌కతా కేంద్రంగా దేశంలోని ప్రధాన నగరాలకు జరుగుతున్న మానవ అక్రమ రవాణా దందా ఇది. చాదర్‌ఘాట్‌లో మూడురోజుల క్రితం టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో నలుగురు బర్మా యువతులు, ముగ్గురు మైనర్లు వ్యభిచార కూపం నుంచి బయటపడ్డారు.
అందులో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారు బంగ్లాదేశ్‌కు సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులను పోలీసులు విచారించే క్రమంలో అక్రమరవాణాకు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి గుట్టుగా పశ్చిమబెంగాల్‌కు తీసుకొస్తారు. సిటీ పోలీసులు ఈ రెండేళ్ల వ్యవధిలో బర్మా, మయన్మార్‌కు చెందిన 40 మంది యువతులు, 10 మంది మైనర్లను వ్యభిచార కూపం నుంచి బయటపడేశారు. ప్రస్తుతం సుమారు 50మందికి పైగా ఇక్కడకు వచ్చినట్లు సమాచారం. వీరిని కూడా వారివారి దేశాలకు పంపడానికి సిటీ పోలీసులు ప్లాన్ చేసుకుంటున్నారు.
విదేశాల నుంచి యువతులను, మైనర్లను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ చెబుతారు. ఇందుకోసం వారి కుటుంబాలకు అడ్వాన్స్‌గా రూ.25 వేల నుంచి రూ.35వేలు చెల్లిస్తారు. మయన్మార్, బర్మా దేశాలకు చెందిన వారికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడంతో వారి విషయంలో దళారులు ఆసక్తి చూపుతారని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకోసం ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారని, కుటుంబాలకు ఇచ్చే డబ్బుల కంటే ఇక్కడ తాము అమ్మిన చోట వచ్చే డబ్బులు ఒక్కొక్కరికీ రూ.70వేల నుంచి రూ.80వేల వరకు చెల్లిస్తున్నారు. అది కూడా వారి వయసు, అందాన్ని బట్టి రేట్ నిర్ణయమవుతుంది. మైనర్లయితే ఒక్కొక్కరికీ రూ.50వేల వరకు చెల్లిస్తారని తెలిసింది.
ఢిల్లీ, హైదరాబాద్ , ముంబై, చెన్నై, బెంగళూరు, విశాఖలలో వీరి డిమాండ్ ఎక్కువగా ఉందని పోలీసుల విచారణలో నిందితులు చెప్పారు. విదేశాల నుంచి అక్రమంగా తెచ్చిన వారిని ఆయా నగరాల్లో స్పా సెంటర్లు, బ్యూటీపార్లర్లు, మసాజ్సెంటర్లు తదితర చోట్ల పెట్టి దందా నడిపిస్తున్నారు. వారి కుటుంబ అవసరాలను ఆసరాగా చేసుకుని కూడా రేట్లు నిర్ణయిస్తారని, ఈ విషయంలో కూడా రెండు మూడు ముఠాలు పోటీ పడుతున్నట్లుగా చెప్పినట్లు తెలిసింది. కేవలం వారం, పదిరోజుల కోసం విదేశీ యువతులకు ఒక్కో ప్రాంతంలో డిమాండ్‌ను బట్టి రేట్లు నిర్ణయించి వీరికి విలాసవంతమైన జీవితాన్ని అందించి పనుల్లోకి దింపి వారికి కావాల్సిన సొమ్మును ఇస్తూనే తమ పబ్బం గడుపుకొంటున్నారు.
ప్రధానంగా ఈ మానవ అక్రమరవాణా కోల్‌కతా కేంద్రంగా జరుగుతున్నది. పశ్చిమ బెంగాల్‌కు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి అక్కడ నకిలీ ఆధార్‌కార్డులు సృష్టించి బెంగాల్ వారి మాదిరిగా చెలామణి అవుతారు. పోలీసులు పట్టుకున్నప్పుడు కూడా వారు బెంగాల్‌కు చెందినవారిగానే ఆధారాలు చూపుతున్నా.. నకిలీలని తేల్చేసి అసలు విషయాలు రాబడ్తున్నట్లు పోలీసులు చెప్పారు. బంగ్లా నుంచి కొందరు మహిళలు, యువకులు కలిసి బెంగాల్లోకి సరిహద్దు గ్రామాలు, సొరంగాల ద్వారా చేరుకుంటారు.
ఆ తర్వాత వారి ఐడెంటిటి రూపొందించుకొని..బర్మా, మయన్మార్ నుంచి యువతులను, మైనర్లను ఉపాధి చూపిస్తామంటూ తీసుకొచ్చి డేటింగ్ యాప్‌లు, వ్యభిచార గృహాలకు పంపిస్తున్నారు. కోల్‌కతాలోని దళారులు ఐదారు గురు బర్మా, మయన్మార్ యువతులను, మైనర్లను వారికి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లి వారం రోజులకు, పదిరోజుల కోసం అక్కడ పనిచేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఒకేచోట ఉంటే పోలీసులు అనుమానించే అవకాశం ఉండడంతో వారిని ఎప్పటికప్పుడు వేర్వేరు ప్రాంతాలకు మారుస్తున్నారు. నిర్వాహకులు మాత్రం విదేశీ యువతులు చేసే పనిలో వారికొచ్చే ఆదాయానికి తగ్గట్లుగా కమిషన్, నెలవారీ జీతం కూడా ఇస్తున్నారు. అందం, ఆకర్షణ, వయసు.. ఈమూడే ప్రధానంగా విదేశీ యువతుల, మైనర్ల అక్రమరవాణా కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.