ఖైరతాబాద్, జూలై 16: భవన నిర్మాణ సమయంలో ఒప్పందం మేరకు వాటా ఇస్తామని అన్యాయం చేశారంటూ హైదరాబాద్ సెక్యూరిటీ అండ్ ఎంట్రప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన షేర్ హోల్డర్స్ ఆరోపించారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని ప్రణవ గ్రూప్ భవనం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షేర్ హోల్డర్స్ విజయేందర్, రామ్ స్వరూప్ మాట్లాడుతూ ప్రముఖ హైదరాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ సంస్థకు ఎర్రమంజిల్‌లో ఐదెకరాల భూమి ఉందన్నారు. సదరు సంస్థ హైదరాబాద్ సెక్యూరిటీ అండ్ ఎంట్రప్రైజెస్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందిందని, కాలక్రమంలో అది కూడా మూతపడడంతో అందులో ఉన్న 297 మంది షేర్ హోల్డర్స్ తమకు చెందిన స్థలంలో కమర్షియల్, రెసిడెన్షియల్ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారన్నారు. అదే క్రమంలో ఓ బిల్డర్‌తో ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్‌గా ఒప్పందం చేసుకున్నామన్నారు. అయితే 2020లోనే నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా, మరో నాలుగేండ్లు పొడిగించారన్నారు.
5 లక్షల 50వేల ఎస్ఎఫ్టీలలో నిర్మించిన కమర్షియల్, రెసిడెన్షియల్ భవనాల్లో షేర్ హోల్డర్స్‌కు పంపకాల్లో సరైన న్యాయం జరుగలేదన్నారు. నిర్మాణదారులు 297 మందిలో 197 మందికి డబ్బు లు ఇచ్చి సెటిల్ చేసుకున్నారని, అయితే తమకు డబ్బులు వద్దని, ఒప్పందం ప్రకారం పంపకాల్లో పోను తమకు రావాల్సిన ఒక లక్ష ఎస్ఎఫ్టీలో నిర్మాణాలకు వంద మందికి ఒక్కొక్కరికీ వెయ్యి ఎస్ఎఫ్టీ చొప్పున ఇవ్వాల్సిందేనన్నారు. ఈ విషయంపై సదరు నిర్మాణదారులు, నాడు సంస్థకు ప్రాతినిధ్యం వహించిన పెద్దలను అడిగితే బుకాయిస్తున్నారని, సదరు సంస్థ వద్దకు వెళితే సెక్యూరిటీ సిబ్బందితో అడ్డుకుంటున్నారన్నారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ సెక్యూరిటీ అండ్ ఎంట్రప్రైజెస్ లిమిటెడ్‌కు చెంది న స్థలంలో ఒప్పందం ప్రకారమే నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని, అందరికీ న్యాయబద్ధంగా షేర్స్ ఇచ్చామని ఆ సంస్థ మాజీ చైర్మన్ శివ కుమార్, మాజీ డైరెక్టర్ జదీశ్వర్ రావు మీడియాకు తెలిపారు. తమపై ఐటీ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేశారని, పారదర్శకంగా ప్రతి డాక్యుమెంట్‌ను వారికి అందజేశామన్నారు. నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) ఇప్ప టి వరకు 18 సార్లు ఫిర్యాదు చేయడం, కేసులు వెనక్కి తీసుకోవడం చేశారని, వారి ఆరోపణలు పూర్తిగా సత్యదూరమన్నారు. తా ము ఎవరికీ అన్యాయం చేయలేదని, అసత్యపు ఆరోపణలు చేస్తే చట్టపరంగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.