సిటీబ్యూరో, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు ఆటోలో ప్రయాణిస్తుండగా ఆటో డ్రైవర్ తన స్నేహితుల సహకారంతో అతని దృష్టి మరల్చి అతడి సెల్‌ఫోన్ కొట్టేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుమేరకు కూపీలాగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వివరాలు.. గత నెల 17వ తేదీన బాధితుడు ఉప్పల్ నుంచి తార్నాకకు ఆటోలో ప్రయాణించాడు.
ఆటో దిగే సమయంలో డిజిటల్ పేమెంట్ చేయాలని ఆటోడ్రైవర్ మహ్మద్ మొయినుద్దీన్ కోరాడు. వృద్ధుడు అతను కోరినట్లే డబ్బు చెల్లించాడు. అదే ఆటోలో ప్రయాణిస్తున్న మహ్మద్ సయ్యద్ సల్మాన్ ఆ వృద్ధుడిని మాటల్లో పెట్టగా ఆటోడ్రైవర్ బాధితుడి ఫోన్ కొట్టేశాడు. తన ఫోన్ పోయినట్లుగా గుర్తించిన బాధితుడు సిమ్ బ్లాక్ చేయించి కొత్త సిమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1.95లక్షలు మాయమైనట్లు తెలుసుకుని సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు.. కొట్టేసిన డబ్బును నిందితులందరూ కలిసి పంచుకున్నట్లు గుర్తించారు. సైబర్ పోలీసులు ప్రధాన నిందితుడైన బాలానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మొయినుద్దీన్, బాలానగర్‌కు చెందిన కార్డ్రైవర్ సయ్యద్ సల్మాన్, రాజేంద్రనగర్‌కు చెందిన కూరగాయల వ్యాపారి మహ్మద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.