Hyderabad | వెంగల్రావునగర్, జనవరి 10 : బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నప్పుడు కొంత డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ బ్యాంకు ఉద్యోగులపై కక్షగట్టిన ఓ మహిళ ఏటీఎంను ధ్వంసం చేసింది. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… రహ్మత్‌నగర్‌కు చెందిన గృహిణి (35) సూర్యపేటలోని ప్రాపర్టీని అమ్మడంతో రూ.7 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును తన ఖాతాలో జమ చేసేందుకు యూనియన్ బ్యాంకుకు వెళ్లి అక్కడ క్యాషియర్‌కు డబ్బులు అందజేసింది.
డబ్బులు లెక్కించిన క్యాషియర్ రూ. 21వేలు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. తాను 7 లక్షలు ఇచ్చానంటూ రూ. 21వేలు ఎలా తగ్గాయంటూ జరిగిన వాదనలు గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో డయల్ 100కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఎలాంటి అవకతవకలు కనిపించలేదు. ఇదిలా ఉండగా, సదరు మహిళ శుక్రవారం ఉదయం యూనియన్ బ్యాంకు ఏటీఎం డిపాజిట్ మెషీన్ వద్దకు వెళ్లి బండరాయి వేసి దానిని ధ్వంసం చేసింది. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.