Operation Musi | మలక్‌పేట, అక్టోబర్ 27: మూసీలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. దసరా పండుగ ముందు విరామం ప్రకటించి 15 రోజులుగా కూల్చివేతలను నిలిపివేసిన ప్రభుత్వం, చడీ చప్పడు కాకుండా శనివారం నుంచి మళ్లీ మొదలుపెట్టింది. మూసీ నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం చెబుతున్నదొకటి.. చేస్తున్నది ఇంకోటి, మొన్నటి వరకు మూసీ బాధితుల నివాసాల కూల్చివేతలను నిలిపివేసిన ప్రభుత్వం, మళ్లీ శనివారం నుంచి తిరిగి ప్రారంభించింది. బాధితులే స్వయంగా వారి ఇండ్లను కూల్చివేసుకుంటున్నారు. సంతోషంగా ఖాళీచేసి వెళ్లిపోతున్నారని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మూసీ నిర్వాసితులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చాదర్‌ఘాట్‌లోని మూసానగర్, పాత మలక్‌పేట డివిజన్లోని శంకర్‌నగర్ మూసీ నిర్వాసితులు పునరావాస డబుల్ బెడ్రూం ఇండ్లు బాగా లేవని, అక్కడ అనేక సమస్యలున్నాయని, అక్కడి కన్నా మూసీ పరీవాహక ప్రాంతంలోని తమ ఇండ్లే బాగుండేవని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామని ఆశ జూపి తమను సమస్యల్లో పడేశారని నిత్యం దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ఉరి తీసే ముందు చివరి కోరిక ఎంత జఠిలమైనదైనా, అసాధ్యమైనదైనా తప్పక తీరుస్తారని, అలాంటిది మూసీలో ఇండ్లను కోల్పోతున్న నిర్వాసితులకు,
వారికి ఇష్టమున్నచోట డబుల్ బెడ్రూం ఇండ్లను ఇవ్వాలని, ఎవ్వరిని అక్కడిపో, ఇక్కడిపో అని బలవంత పెట్టోద్దని నీతి సూక్తులు వల్లించిన ముఖ్యమంత్రి, తమ ఇష్టాలకనుగుణంగా తాము కోరినచోట ఇండ్లు ఇవ్వటంలేదని బాధితులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నచ్చినచోట ఇల్లును కేటాయించుమంటే అధికారులు అలా కుదరదు. అక్కడ ఇవ్వలేం.. అది మా జిల్లా పరిధిలో లేదు. మేం ఇచ్చే ఆప్షన్లలో ఏదో ఒకటే ఎంచుకోవాలని ఒకమాట, అక్కడ ఇవ్వాలంటే కలెక్టర్ పర్మిషన్ కావాలని, కలెక్టర్ వద్ద నుంచి పర్మిషన్ లెటర్ తెచ్చి ఇస్తే అది అంతా సులువైన పని కాదని, ఇవ్వటానికి చాలా టైం పడుతుందని అధికారులు చెబుతున్నారని బాధితులు మండి పడుతున్నారు.
మూసీ రివర్ బెడ్లో మా ఇల్లు పోయింది. అధికారులు మాకు డబుల్ బ్రెడూం ఇల్లును జియాగూడలో అలాట్ చేశారు. కానీ, అక్కడికి వెళ్లాలంటే మా ఆయన జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తుంది. మా పిల్లల చదువుల విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాకు అక్కడ కాకుండా వనస్థలిపురంలో ఇల్లు ఇస్తే అన్ని విధాల బాగుంటుందని అధికారులను కోరాను. అయితే, నచ్చిన చోట ఇల్లును కేటాయించుమంటే అధికారులు అలా కుదరదు, అక్కడ ఇవ్వలేం, అది మా జిల్లా పరిధిలో లేదు. మేం ఇచ్చే ఆప్షన్లలో ఏదో ఒకటే ఎంచుకోవాలని, దూరంగా ఉన్న ప్రాంతాల పేర్లు ఇచ్చారు. కోరినచోట ఇవ్వాలంటే కలెక్టర్ పర్మిషన్ కావాలని చెప్పారు. నేను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద నుంచి పర్మిషన్ లెటర్ తెచ్చి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చి పదిరోజులవుతుంది. ఇంత వరకు ఏమీ స్పందన లేదు. – మ్యాతరి అరుణ (సాయిలు హట్స్)
నలభయ్యేండ్లుగా ఒకేచోట అంతా కలిసి మెలిసి ఉన్నం. మూసీ సుందరీకరణ పేరుతో మమ్మల్ని చెట్టుకోకల్ని, పుట్టకొకల్ని చేసిండ్రు. ఎవరికి నచ్చిన చోటికి వారు వెళ్తున్నారు. బాగు చేస్తడని ఓటేస్తే బర్బాత్ చేస్తుండు. మా జీవితాలతో ఆడుకుంటున్నదీ.. కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడి నుంచి వెళ్లాలని లేదు. కానీ, ఇష్టం లేకున్నా వెళ్లాల్సి వస్తుంది. ఏం చేస్తం, నాయకులు మేలు చేస్తారని గెలిపిస్తే మా బతుకులతోనే ఆడుకుంటున్నరు. ప్రజల గురించి ఆలోచించేటోడు నాయకుడు. ప్రజల్ని పీక్కు తినోటోడు.. బకాసూరుడు.. రాక్షసుడు. మా పేదోల్ల ఉసురు తప్పక తగులుద్ది. పైవాడు అంతా చూస్తున్నడు.. మా బతుకులతో ఆడుకున్న ముఖ్యమంత్రి బతుకు ముందెట్లా ఉంటదో.. ఇగ చూడమా? మేము ఉపాధి కోల్పోయి, పిలగాండ్ల చదువుల్ని కూడా దుర్బరం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్లి పోవాల్సి వస్తుంది.
– రామకృష్ణ (అంబేద్కనగర్ బస్తీ)