సిటీబ్యూరో, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ) : కుప్పకూలిన సిటీ రియాల్టీ కోలుకోవడమే కష్టంగా మారింది. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అమ్మకాలు లేక విలవిలలాడుతోంది. ప్రభుత్వం ఓవైపు భూముల వేలాలను నిర్వహించి, రికార్డు స్థాయి పేరిట అమ్మకాలని హడావుడి చేస్తున్నా.. రెసిడెన్షియల్ మార్కెట్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా మూడో త్రైమాసికంలో హౌసింగ్ అమ్మకాలు 19 శాతం పడిపోగా.. గతేడాదితో పోల్చితే దారుణంగా ఫ్లాట్లకు డిమాండ్ పడిపోతున్నది. దేశంలోని ప్రధాన నగరాల్లో అక్టోబర్ – డిసెంబర్ వరకు అమ్ముడుపోయిన ఇండ్లపై ప్రాప్ ఈక్విటీ నివేదికను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 16శాతం అమ్మకాలు పడిపోగా, కొత్త డిమాండ్ 10శాతం తగ్గిందని తేలింది.
హైదరాబాద్‌లో మూడు నెలల్లో 11323 యూనిట్లను విక్రయించగా, గతేడాది కంటే 1500 యూనిట్లు తక్కువగా అమ్ముడు పోయాయి. నగరంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్లో డిమాండ్ తగ్గిపోతున్నది. హైదరాబాద్‌లో 19 శాతం తగ్గుదల ఉండటం హౌసింగ్ డిమాండ్‌ను సూచిస్తోంది. అక్టోబర్ 2025లో రిజిస్ట్రేషన్లు 5శాతం పెరిగితే, లగ్జరీ సెగ్మెంట్లో కొంత డిమాండ్ ఎక్కువగా ఉంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు 61,699 రిజిస్ట్రేషన్లు జరిగినా.. గడిచిన ఏడాదితో పోల్చితే 10శాతం తక్కువే. కానీ ఆదాయం విషయంలో మాత్రం 25శాతం పెరుగుదల ప్రీమియం ఫ్లాట్లకు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తున్నది. కానీ ఆఫర్డబుల్ సెగ్మెంట్లో డిమాండ్ తగ్గిపోవడం నగరంలో సామాన్యుడికి ప్రతికూలంగా మారుతుందని సూచిస్తోంది.
ఈ లెక్కన భవిష్యత్తులో ఇండ్ల ధరలు మరింత పెరిగితే.. నగరంలో కొనుగోలు చేయడమే కష్టతరం అవుతుందనీ, పేదోడి సొంతింటి కల కలగానే మిగిలిపోతుందనీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక అమ్మకాలు క్రమంగా పడిపోతుండటంతో కొత్త ప్రాజెక్టుల హడావుడి కూడా తగ్గిపోతున్నది. నిర్మాణ సంస్థలు కూడా కొత్త ప్రాజెక్టులను ఆవిష్కరించడం కంటే పాత ప్రాజెక్టులో మిగిలిన ఇన్వెంటరీని తగ్గించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ క్రమంలో బిల్డర్ ఆర్థిక వనరుల సర్దుబాటుకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ఉన్న ఫ్లాట్లను క్రమంగా విక్రయించుకోవడం ద్వారా కంపెనీలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. గడిచిన రెండేళ్లలో కొత్త ప్రాజెక్టుల అనుమతులు, హైడ్రా కూల్చివేతలు, మార్కెట్ తిరోగమనం దృష్ట్యా లాంఛింగ్లూ కూడా గడిచిన మూడేళ్లతో పోల్చితే 20శాతం మేర తగ్గినట్లుగా చెబుతున్నారు.