సిటీబ్యూరో, జూన్ 3(నమస్తే తెలంగాణ): గోషామహల్ పోలీస్ స్టేడియం ప్రాంగణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం చేపట్టనున్నందున అక్కడ ఉన్న పోలీస్ శాఖకు చెందిన అన్ని బ్లాకులను తరలించామని, హార్స్గ్రౌండ్, గుర్రపుశాలను తాత్కాలికంగా స్టేడియంలోని ఖాళీ స్థలంలోకి తరలించామని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ తెలిపారు. మంగళవారం గోషామహల్ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. తమ శాఖకు చెందిన అన్ని విభాగాలను తరలించి వైద్యశాఖకు అప్పగించనున్నామని, ప్రభుత్వం హైదరాబాద్ సిటీపోలీస్కు గోషామహల్లోనే 11.5 ఎకరాలు కేటాయించిందని తెలిపారు. ఈ స్థలంలో రెండు ఐదంతస్తుల భవనాలను నిర్మిస్తామని, అందులో ఒకటి సిటీ సెక్యూరిటీ వింగ్ కోసం, మరొకటి నగరంలో ఏడు జోన్లలో సీజ్ చేసిన పలు వాహనాలను నిలిపి ఉంచడానికి అనువుగా ఉండేలా తయారు చేయబోతున్నామని, ఇదే చోట గుర్రపుశాలను, హార్స్ గ్రౌండ్‌ను తయారు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ నగరంలో ధర్నాలు, ర్యాలీలు, నిరసనదీక్షలు వంటివి ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయని, ఆ సమయంలో మహిళలను అరెస్ట్ చేయాల్సి వస్తే చాలా ఇబ్బందికరంగా ఉండేదని సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి హైదరాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్తగా ఎంపికైన 35 మంది మహిళా కానిస్టేబుళ్లతో ఒక టీమ్‌ను స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్‌గా ఏర్పాటు చేశామన్నారు. వీరికి గత కొన్ని రోజులుగా కరాటేలో శిక్షణ ఇవ్వడంతోపాటు ధర్నాల సమయాల్లో మహిళలను ఏ విధంగా అదుపులోకి తీసుకుని సురక్షితంగా తరలించాలనే దానిపై ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చామని కమిషనర్ వివరించారు. త్వరలో ఇంకా కొంత మందిని చేర్చుకుని మొత్తం 42 మందితో రెండు ప్లాటూన్లుగా విభజిస్తామని సీపీ తెలిపారు. కార్యక్రమానికి సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ రక్షితకృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీలు డి.కృష్ణయ్య, ఎన్.భాస్కర్, ఇక్బాల్ సిద్ధిఖి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.